
వినూత్న చిత్రాల దర్శకుడు రవిబాబు తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘అవును 2’. 2012లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘అవును’ చిత్రానికి రెండో భాగంగా రూపొందిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవును సినిమా విజయం, రవిబాబు సినిమాల పట్ల ఉన్న క్రేజ్, అద్భుతమైన టీజర్ లాంటివి ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. సినిమా విడుదల తర్వాత కూడా మంచి రెస్పాన్స్ రావడం, బీ, సీ, సెంటర్లలో సైతం సినిమా మంచి టాక్‌ని సంపాదించడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
ఇక తాజాగా ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌తో ఈ సినిమాకు థియేటర్ల సంఖ్యను కూడా పెంచేశారు. నిన్నట్నుంచి ఈ సినిమా దాదాపుగా 25 కొత్త థియేటర్లలో ప్రదర్శితమౌతోంది. సినిమాలో భయపెట్టే కొన్ని సన్నివేశాలు, రవిబాబు మేకింగ్, పూర్ణ నటన ఇవన్నీ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. సినిమా విజయం పట్ల దర్శకుడు రవిబాబు, సహ నిర్మాత సురేష్ బాబు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.