
బాలీవుడ్‌లో గత కొంతకాలంగా లేడీ ఓరియంటడ్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. గత సంవత్సర కాలంగా విడుదలైన సినిమాల్లో లేడీ ఓరియంటడ్ సినిమాలు ఇటు విమర్శకుల ప్రశంసల పరంగానూ, బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగానూ సూపర్ అనిపించుకున్నాయి. ఇప్పుడదే కోవలో కొత్త కథాంశాలనే సున్నితమైన భావోద్వేగాలతో, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించే దర్శకుడైన ఏ. ఆర్. మురుగదాస్ ఓ లేడీ ఓరియంటడ్ సినిమాతో మన ముందుకు రానున్న విషయం తెలిసిందే!
తమిళంలో ‘కత్తి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత మురుగదాస్ హిందీలో సోనాక్షి సిన్హాతో ‘అకిరా’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఏ.ఆర్.మురుగదాస్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ డైలాగ్స్ అందించారు. జూలై మొదటి వారానికి ఈరోజే మొదలైన చివరి షెడ్యూల్ ముగుస్తుందని సమాచారం. ‘అకిరా’ అంటే మంచి గుండె నిబ్బరం కలిగి ఉన్న వ్యక్తి అని అర్థం వచ్చేలా తెరకెక్కుతోన్న ఈ సినిమా నేటి సమాజానికి అద్దం పట్టే సినిమాగా చెప్పబడుతోంది.

