
కొత్త కథాంశాలనే సున్నితమైన భావోద్వేగాలతో, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించే దర్శకుల్లో ఒకరు ఏ. ఆర్. మురుగదాస్. తన కథలతో కేవలం తమిళంలోనే కాక తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో కూడా తానేంటో నిరూపించుకున్నారు. తమిళంలో ‘కత్తి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత మురుగదాస్ హిందీలో ‘అకిరా’ పేరుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సోనాక్షి సిన్హా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ లక్ష్మీ రాయ్ కీలక పాత్రలో కనిపించనుంది.
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మధ్యే సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్లో సోనాక్షి సిన్హా, లక్ష్మీ రాయ్ తదితరులు పాల్గొంటున్నారు. ఏ.ఆర్.మురుగదాస్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ డైలాగ్స్ అందించారు. ‘అకిరా’ అంటే మంచి గుండె నిబ్బరం కలిగి ఉన్న వ్యక్తి అని అర్థం వచ్చేలా తెరకెక్కుతోన్న ఈ సినిమా నేటి సమాజానికి అద్దం పట్టే సినిమాగా చెప్పబడుతోంది.