‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ అరసాడ తన కెరీర్ ప్రయాణాన్ని వెల్లడించారు. విశాఖపట్నానికి చెందిన అజయ్, టీసీఎస్‌లో ఏడేళ్ల పాటు ఉద్యోగం చేస్తూనే పరిశ్రమలోకి అడుగుపెట్టారు. శ్రీచరణ్ పాకాల ప్రోత్సాహంతో ‘గూఢచారి’ చిత్రానికి కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా పనిచేసిన ఆయన, దేవి శ్రీ ప్రసాద్‌ను స్ఫూర్తిగా తీసుకుని సంగీత దర్శకుడిగా మారారు.
జనసేన పార్టీ కార్యక్రమాలకు తాను సంగీతం అందించిన సందర్భాన్ని అజయ్ గుర్తుచేసుకున్నారు. “ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ కలిసిన సమయంలో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూసి ఆయన నన్ను పిలిపించారు. కేవలం ఫొటో దిగి వచ్చేస్తానని అనుకున్నాను. కానీ ఆయన దాదాపు అరగంట పాటు నాతో వ్యక్తిగతంగా మాట్లాడారు. రాజకీయ కార్యక్రమాలతో పాటు పీకే క్రియేటివ్స్ బ్యానర్‌లో కలిసి పనిచేద్దామని చెప్పారు. నా దగ్గరున్న కాఫీ మగ్ ఆకారపు బోస్ స్పీకర్‌ను చూసి ‘కాఫీ తెచ్చావా?’ అంటూ సరదాగా మాట్లాడారు” అని తెలిపారు.
సంగీతంపై ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తీవ్ర ప్రభావం ఏమీ చూపించలేదని అజయ్ పేర్కొన్నారు. ఏఐని ఒక సాధనంగా వాడుకోవచ్చని, అయితే దాన్ని ఉపయోగించినంత మాత్రాన ఎవరూ సంగీత దర్శకులు కాలేరని స్పష్టం చేశారు. ప్రస్తుత దర్శకుల్లో కొందరు కథా నేపథ్యాన్ని స్పష్టంగా వివరించలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు.
మరోవైపు క్రెడిట్స్ విషయంలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంటూ.. ‘ఆయ్’ చిత్రంలో రామ్ మిర్యాల రెండు పాటలు స్వరపరచగా, మిగిలిన పాటలతో పాటు నేపథ్య సంగీతం తానే అందించినప్పటికీ మీడియాలో క్రెడిట్స్ సరిగ్గా రాలేదని చెప్పారు. ఆ సమయంలో నిర్మాత బన్నీ వాస్ ప్రతి కార్యక్రమంలోనూ తన పేరును ప్రస్తావించారని తెలిపారు. సరైన అవకాశం వస్తే భారీ కమర్షియల్ చిత్రాలకు సైతం పూర్తిస్థాయిలో న్యాయం చేయగలననే నమ్మకం తనకు ఉందని అజయ్ వెల్లడించారు.
