
కొరటాల శివ.. ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారి సూపర్ హిట్ కొట్టిన ఈ రచయిత, రెండో సినిమా ‘శ్రీమంతుడు’తో టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారి. సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఆగష్టు 7న విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తోన్న విషయం తెలిసిందే. ఊరిని దత్తత తీసుకొని బాగుపరచడమనే ఓ సోషల్ మెసేజ్ అంశం ముడిపడి ఉన్న కథను, కొరటాల శివ కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యేలా చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. కొరటాల స్టైల్ టేకింగ్‌కు సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఇక తాను ఎంతో రాసుకున్న శ్రీమంతుడు కథకు ప్రేక్షకుల దగ్గర్నుంచి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉందని కొరటాల శివ తెలిపారు. సినిమాలంటే ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చిన తాను, ఈ స్థాయి విజయాన్ని తక్కువ సమయంలోనే అందుకోవడం కొత్తగా ఉందని అన్నారు. “చిన్నప్పట్నుంచీ అమ్మ నేర్పిన విషయాలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ప్రతీ విషయంపైన నిర్దిష్టమైన అభిప్రాయం, సొంతంగా ఆలోచించగల నేర్పు అమ్మే నేర్పింది. మా అమ్మే నాకు ఇన్స్పిరేషన్” అని తెలిపారు. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

