సినిమా చూస్తూ పాప్‌కార్న్, సమోసాలు తినడం రొటీన్ అనుకునే ప్రేక్షకులకు మైత్రీ థియేటర్స్ సరికొత్త అనుభూతిని అందిస్తోంది. నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రం సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అసలైన స్థానిక రుచిని సింగిల్ స్క్రీన్స్ క్యాంటీన్లలోకి తీసుకొచ్చారు.
మైత్రీ విమల్, మైత్రీ శివగంగ థియేటర్లలో ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్ అనుభవాన్ని మరింత ప్రత్యేకం చేస్తూ సాంప్రదాయ వంటకం ‘సర్వపిండి’ని అందుబాటులో ఉంచారు. ‘బామ్మ స్టోరీస్’ (BaammaStories) ద్వారా ప్రాచుర్యం పొందిన 77 ఏళ్ల బామ్మ స్వయంగా ప్రేమతో సిద్ధం చేసిన సర్వపిండిని ఇక్కడ విక్రయిస్తున్నారు.
ఇప్పటివరకు ఒక చిన్న టిఫిన్ సెంటర్‌కే పరిమితమైన ఈ తెలంగాణ రుచి, ఇప్పుడు బిగ్ స్క్రీన్ల వరకు చేరి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. స్థానిక వంటకాలకు పెద్దపీట వేస్తూ మైత్రీ థియేటర్స్ తీసుకున్న ఈ నిర్ణయం సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని పంచుతోంది.


