అనుష్క ‘సైజ్ జీరో’ కోసం నాగ్, జీవా..!

nag-anushka-jeeva
సౌతిండియన్ సినిమాల్లో హీరోయిన్‌గా సూపర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న అనుష్క, తాజాగా సైజ్ జీరో పేరుతో ఓ పెద్ద సాహసమే చేసిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన సైజ్ జీరో సినిమా కోసం అనుష్క ఏకంగా 25 కేజీలకు పైనే బరువు పెరిగి సంచలనంగా నిలిచారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ రిలీజ్ తర్వాత అంతటా సూపర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక ఈ క్రేజ్‌ను మరింత పెంచేలా సైజ్ జీరో సినిమాలో కింగ్ నాగార్జున ఓ గెస్ట్ రోల్ చేయనుండడం విశేషంగా కనిపిస్తోంది.

సైజ్ జీరోలో ఓ కీలక నేపథ్యంలో వచ్చే ఒక అతిథి పాత్రలో నాగ్ కనిపించనున్నట్లు గతంలోనే ప్రచారం జరిగింది. తాజాగా ఇందుకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో సినిమా యూనిట్ ఉంది. ఇక తెలుగులో నాగార్జున చేస్తోన్న గెస్ట్‌రోల్‌ను తమిళ వర్షన్‌లో జీవా చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్‌తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసిన సైజ్ జీరో యూనిట్, నాగార్జున కోసం ఈ పార్ట్‌ను కొంతకాలం పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిన్న పార్ట్‌ షూట్‌ను పూర్తి చేయనున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో నవంబర్ 1న విడుదల కానుండగా, నవంబర్ 27న సినిమా విడుదల కానుంది.

Exit mobile version