‘స్వామిరారా’ సినిమాతో తెలుగులో క్రైమ్ కామెడీ సినిమాలకు ఒక కొత్త దారిని ఏర్పరచిన దర్శకుడు సుధీర్ వర్మ. తన రెండో ప్రయత్నం ‘దోచేయ్’ సినిమాకు కూడా క్రైమ్ కామెడీ నేపథ్యాన్నే ఎంచుకొని మరోసారి మెప్పించాడు. లవర్ బాయ్ నాగ చైతన్యను ఓ దొంగతనాలు చేసే వ్యక్తిగా చూపెడుతూ సుధీర్ వర్మ తెరకెక్కించిన ‘దోచేయ్’ గత శుక్రవారం (ఏప్రిల్ 24న) విడుదలై ప్రేక్షకుల దగ్గర్నుంచి మంచి స్పందననే రాబట్టుకుంటోంది. ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే!
ఇదిలా ఉంటే ఇప్పటికే సుధీర్ వర్మకు నాగార్జున మరో అవకాశాన్ని ఇవ్వడం ఆసక్తికర అంశం. నాగ చైతన్య ‘దోచేయ్’ చూసిన నాగార్జున, సుధీర్ వర్మ టేకింగ్ పట్ల ప్రశంసలు కురిపించారు. తనతో ఓ సినిమా తీయమని నాగార్జున సుధీర్ వర్మకు అవకాశమిచ్చారు. ఇదే విషయాన్ని సుధీర్ వర్మ తెలియజేస్తూ.. “నాగార్జున గారినే దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. నాకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది?” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం నాగార్జునకు కథ సిద్ధం చేసే పనిలో సుధీర్ ఉన్నారు. అన్నీ కుదిరితే నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు పూర్తవగానే సుధీర్ వర్మ సినిమా మొదలుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.


