నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. రియా జియా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా హీరో నందు విభిన్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. బ్లింకిట్ డెలివరీ బాయ్ గెటప్‌లో, అలాగే మార్కెట్‌లో కూరగాయలు విక్రయించే వ్యక్తిగా మారి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సినిమా గురించి వివరిస్తున్నారు. ఈ వినూత్న ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
