విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు ఇది తెలుగు రీమేక్. ఒరిజినల్ వెర్షన్లో ధనుష్ చేసిన పాత్రను తెలుగులో వెంకీ చేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తరుణంలో కరోనా లాక్ డౌన్ రావడంతో ఆగిపోయింది. ఏడు నెలల గ్యాప్ తర్వాత మళ్లీ ఈమధ్యనే షూట్ మొదలైంది. చిత్ర బృందం ఔట్ డోర్ లొకేషన్లకు వెళ్లకుండా హైదరాబాద్లోనే సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ఒక కొలిక్కి రావడంతో బృందం ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. రేపు వెంకీ పుట్టినరోజు సందర్బంగా సాయంత్రం 8 గంటలకు విడుదల చేయనున్నారు.
చిన్నపాటి వీడియో టీజర్ తరహాలో ఉండబోయే ఈ టీజర్లో నారప్ప పాత్రను, అతని కుటుంబాన్ని పరిచయం చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమా మీద వెంకీ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ చిత్రాన్ని సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో వెంకటేష్ సతీమణిగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తుండగా రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది. కథలో సోల్ మిస్సవకుండా తెలుగు నేటివిటికి తగ్గట్టు మార్పులు చేసి సినిమా చేస్తున్నారు.
