తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 20న నిడదవోలులోని “హృదయాలయం” ప్రత్యేక పాఠశాల, పునరావాస కేంద్రాన్ని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ, న్యూజెర్సీ చాప్టర్ కో-ఆర్డినేటర్ సాయి గంగుల సందర్శించారు. అక్కడ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఐల సహకారంతో హోప్4స్పందన నిర్మించిన ఈ భవనానికి నాట్స్ 10 వేల డాలర్ల ఆర్థిక సాయం అందించింది.
ఈ సందర్భంగా అక్కడి దివ్యాంగ చిన్నారులకు అందుతున్న పునరావాసం, బ్రిడ్జి కోర్సు, ఫిజియోథెరపీ సేవలను నాట్స్ ప్రతినిధులు పరిశీలించారు. మారుమూల, గిరిజన ప్రాంతాల్లోని దివ్యాంగులకు కూడా ఇలాంటి సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
స్వయం ఉపాధి కల్పనలో భాగంగా తొర్రేడు గ్రామంలో గోపికి, వెంకటానగర్‌లో దేవదాసు చినబాబుకు కేటాయించిన కిరాణా దుకాణాలకు నాట్స్ ఒక్కొక్కరికి రూ. 1.30 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ దుకాణాలను నాట్స్ ప్రతినిధులు ప్రారంభించారు.
వెన్నెముక గాయాలతో బాధపడుతున్న వారికి హోప్4స్పందన అందజేస్తున్న 13 రకాల అత్యవసర వస్తువులతో కూడిన నెలవారీ మెడికల్ కిట్లకు నాట్స్ సహకారం అందిస్తోంది. హైదరాబాద్‌లో రాజ్ అల్లాడ ఈ కిట్లను పరిశీలించారు. దీంతో పాటు అనంతపురంలోని ఆశ్రయ అనాథ ఆశ్రమం, హైదరాబాద్ నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో శాశ్వత ఆశ్రయాల ఏర్పాటుకు కూడా నాట్స్ మద్దతు ఇస్తోంది.
హోప్4స్పందన సమన్వయకర్త డాక్టర్ రఘు ఆరికపూడి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో హృదయాలయం వ్యవస్థాపకులు డాక్టర్ గణేష్ బాబు, నిర్వాహకులు డాక్టర్ బలగం విశాలాక్షి, దయ్యాల మహేష్ పాల్గొన్నారు.


