
క్లాస్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల కాస్త రూటు మార్చి తీసిన సినిమా ‘అనామిక’. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైభవ్, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.
ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను రీమేక్ లో ప్రెగ్నెన్సీ ఎందుకు తీసేసారు? నయనతార ఎందుకు ప్రమోషన్స్ కి రాలేదని? అడుగుతున్నారు. ఇది రీమేక్ సినిమానే కానీ మేము చాలా మార్పులు చేసి ఈ సినిమా తీసాం. నేను ఒక మహిళ యొక్క బలాన్ని చూపించే సినిమా చేయాలనుకున్నాను. అప్పుడు వచ్చిందే ఈ కథ. కానీ ఇందులో ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయిని చూపిస్తే జాలి కలుగుతుందే తప్ప మహిళ యొక్క బలం చూపించాలేను అనుకున్నాను. అందుకే ప్రెగ్నెన్సీ పాత్రని ఇందులో పెట్టలేదు. నయనతార ప్రమోషన్స్ కి రాకపోవడం నా పరంగా అయితే నాకు నచ్చలేదు. కానీ ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే నయన్ వచ్చి ప్రమోషన్స్ చేస్తే వచ్చే క్రేజ్ కంటే రాకపోవడం వల్లే సినిమాకి ఎక్కువ క్రేజ్ వచ్చిందని’ అన్నాడు.