రెండు రోజుల్లో పోటీ.. ఆగనంటున్న నయన్..!

లేడీ సూపర్ స్టార్ నయనతార ఆగస్టు చివరి వారంలో ఓ ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతుంది. ఆమె నటించిన రెండు వేర్వేరు చిత్రాలు కేవలం రెండు రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముందుగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుండగా, ఇందులో నయనతార ‘గంగ’ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 28న ఆమె కథానాయికగా, కెవిన్ సరసన నటించిన రొమాంటిక్ కామిడీ డ్రామా ‘హాయ్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఒకే వారంలో రెండు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో నయన్ అభిమానులు ఈ వినూత్న బాక్సాఫీస్ క్లాష్‌ను పండుగలా వేడుక చేసుకుంటున్నారు. బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’ విడుదలవుతున్న సమయంలోనే నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న ‘హాయ్’ వంటి చిత్రాన్ని రిలీజ్ చేయడం కొంత రిస్క్ అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నప్పటికీ, నయన్ క్రేజ్ ముందు అది పెద్ద సమస్య కాదని అభిమానులు నమ్ముతున్నారు. విష్ణు ఎడవణ్ దర్శకత్వంలో పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపుదిద్దుకున్న ‘హాయ్’ చిత్రానికి మంచి టాక్ వస్తే, కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో సొంతంగా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనా ఆగస్టు 26, 28 తేదీలు నయనతార కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోనున్నాయి.

Exit mobile version