నెల్లూరులో ఏకైక సింగిల్ స్క్రీన్ : 75 ఏళ్ల చరిత్ర.. 4K టెక్నాలజీ, 216 రెక్లయినర్ సీట్లతో ‘లీలా మహల్’ రీఎంట్రీ!

Leela-Mahal-Nellore

నెల్లూరు సినీ ప్రేక్షకులకు ఇదొక స్వీట్ న్యూస్. ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రతిష్టాత్మక ‘లీలా మహల్’ థియేటర్ సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెల్లూరు సిటీలో ఇంకా మిగిలి ఉన్న ఏకైక సింగిల్ స్క్రీన్ థియేటర్ ఇదే. మారుతున్న కాలాన్ని, ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం ఈ థియేటర్‌ను అత్యాధునిక సాంకేతికతతో ముస్తాబు చేసింది. 75 ఏళ్ల సినీ వారసత్వాన్ని మోస్తున్న ఈ థియేటర్ ఇప్పుడు ఫ్యూచర్ టెక్నాలజీని జోడించుకుని మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

అత్యాధునిక టెక్నాలజీ.. లగ్జరీ సీటింగ్

సినిమాను ఆస్వాదించే విధానం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అందుకే మల్టీప్లెక్స్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా లీలా మహల్‌ను పూర్తిగా ఆధునికరించారు. స్క్రీన్ మీద బొమ్మ స్పష్టంగా కనిపించేలా బార్కో లేజర్ 4K (Barco Laser 4K) ప్రొజెక్షన్ సిస్టమ్‌ను తీసుకువచ్చారు. దీనికి డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సౌండ్ సిస్టమ్ తోడవడంతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ దక్కనుంది.

సౌండ్, పిక్చర్ క్వాలిటీతో పాటు ప్రేక్షకుల కంఫర్ట్ పైనా యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టింది. థియేటర్‌లో మొత్తం 216 సీట్లను ఏర్పాటు చేశారు. అవన్నీ ఫుల్ ఫ్లాట్, సెమీ రెక్లయినర్ (Flat & Semi recliners) సీట్లే. సినిమా చూస్తున్నంత సేపు ఇంట్లో సోఫాలో కూర్చున్న ఫీలింగ్ కలిగేలా ఈ లగ్జరీ సీట్లను డిజైన్ చేశారు. త్వరలోనే ఈ థియేటర్ అధికారికంగా ప్రారంభం కానుంది. పాత తరం ప్రేక్షకులకు నాటి జ్ఞాపకాలను, నేటి యువతకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఒకే చోట అందించేందుకు లీలా మహల్ సన్నద్ధమైంది.

Exit mobile version