మరో బాలీవుడ్ భామపై కన్నేసిన పూరి

puri-jagan
ఈ ఏడాది ‘టెంపర్’ మరియు ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలు ఇచ్చిన పూరి జగన్నాధ్ అప్పుడే మూడవ సినిమా ‘లోఫర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే డిసెంబర్ 18న ఈ లోఫర్ సినిమాని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. లోఫర్ షూట్ అవ్వగానే పూరి జగన్నాధ్ అప్పుడే తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.

పూరి జగన్నాధ్ తన తదుపరి సినిమా ద్వారా ఇషాంత్ అనే హీరోని లాంచ్ చేయనున్నాడని ఇది వరకే తెలియజేశాం. ప్రతి సినిమా ద్వారా ఓ సరికొత్త బాలీవుడ్ భామని తెలుగుకు పరిచయం చేసే పూరి జగన్నాధ్ తన తదుపరి సినిమా ద్వారా కూడా ఓ బాలీవుడ్ భామని తెలుగుకు పరిచయం చేయనున్నాడు. తనే అమర్య దస్తూర్. ఈ ఏడాది రిలీజ్ అయిన అనేగన్ (అనేకుడు) సినిమాతో తమిళంలో అడుగుపెట్టిన అమర్య దస్తూర్ ని పూరి తన సినిమా కోసం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అనౌన్స్ చేయనున్నారు. యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాని తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించనున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

Exit mobile version