తన సినిమాలకు సంబంధించిన ఎటువంటి విషయాలు బయటకు రాకుండా వాటిపై విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేయడం రాజమౌళికి మాత్రమే తెలిసిన గొప్ప మార్కెటింగ్ టెక్నిక్. తన సినిమాలకు ప్రేక్షకులలో ఉండే క్రేజ్ రీత్యా ఆయన ఇచ్చే చిన్న అప్డేట్ కూడా అత్యంత ఆదరణ పొందుతుంది. బాహుబలి లాంటి భారీ హిట్ తరువాత ఆయన తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా ఫ్యాన్స్ ఆరాటం మాములుగా లేదు. ఆ సినిమా అప్డేట్స్ కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆర్ ఆర్ ఆర్ హీరోలు, వారి పాత్రలు కథా నేపథ్యం గురించి సినిమా ప్రారంభంలోనే చెప్పిన రాజమౌళి ఆ తరువాత ఆ చిత్రంపై ఒక్క అప్డేట్ ఇవ్వలేదు.
కాగా నేడు న్యూ ఇయర్ సంధర్భంగా ఆర్ ఆర్ ఆర్ నుండి కొత్త పోస్టర్ వస్తుందని అందరూ భావించారు. నిన్నటి నుండి ఆర్ ఆర్ ఆర్ టీమ్ కూడా పోస్టర్ ప్రిపేర్ చేస్తున్నామంటూ ట్విట్టర్ అప్డేట్స్ ఇస్తుంటే ఆర్ ఆర్ ఆర్ అభిమానులు ఈ మూవీ నుండి కొత్త అప్డేట్.. అలాగే తెలియని విషయం ఏదైనా తెలియజేస్తారు అనుకున్నారు. అనూహ్యంగా ఎప్పటిదో ఎన్టీఆర్ మరియు చరణ్ ఉన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ పై హ్యాపీ న్యూ ఇయర్ 2020 అంటూ విడుదల చేశారు. నిన్నటి నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్, చరణ్ అభిమానులు ఆ పోస్టర్ చూసి ఇది చాలా దారుణం అంటున్నారు.


