‘కిక్ 2’.. గత రెండు నెలలుగా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ‘కిక్’ సినిమా అభిమానులను ఎదురుచూపులకు పరిమితం చేసిన సినిమా. రేపటితో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తోన్న ఎదురుచూపులకు తెరపడనుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘కిక్ 2’ విడుదలకు సిద్ధమవుతోంది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా 2009లో విడుదలై బంపర్ హిట్ కొట్టిన ‘కిక్’కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, కిక్ కంటే డబుల్ కిక్ ఇస్తుందన్న ప్రచారంతో విడుదలవుతోంది. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించడం విశేషంగా కనిపించింది.
రవితేజ కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా విషయంలో నిర్మాత కళ్యాణ్ రామ్ ఎక్కడా రాజీ పడలేదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్‌లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ సినిమా రేపు విడుదలవుతోన్న సందర్భంగా ఎన్టీఆర్ ‘కిక్ 2’ టీమ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. “కిక్ 2 విడుదల సందర్భంగా టీమ్ మొత్తానికీ నా తరపున బెస్ట్ విషెస్. పటాస్‌తో సూపర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ అన్న ఈ సినిమాతో ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ‘కిక్ 2’ సినిమాకు థమన్ సంగీతం సమకూర్చారు.


