
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న తన 25వ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. టాలీవుడ్ డిఫరెంట్ మూవీస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుగుతోంది. ఎన్.టి.ఆర్ తన లుక్ మొత్తాన్ని మార్చుకొని అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపిస్తోంది. ఈ సినిమాని ప్రారంభించినప్పుడే 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలనుకున్నారు. అనుకున్నట్టుగానే 2016 జనవరి 8వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ఈ చిత్ర టీం అనౌన్స్ చేసింది. తాజాగా ఈ చిత్ర టీం మరో స్టెప్ కూడా తీసుకోనుంది.
ఈ చిత్ర టీం సన్నిహితులు చెప్పిన సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ 25వ సినిమాని తెలుగుతో పాటు తమిళంలో కూడా డబ్ చేసి రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం దానికి సంబందించిన పనులను మొదలు పెట్టే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక అనౌన్స్ మెంట్ కూడా చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సుకుమార్ ఎన్.టి.ఆర్ పై కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా షూటింగ్ లో పాల్గొంటోంది. ఎన్.టి.ఆర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

