
నాగార్జున – కార్తీ ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే దానికి ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందనేది పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న సినిమా ఇప్పటికే చాలాసార్లు ఋజువు చేసింది. ఒక్క ఫస్ట్‌లుక్ విడుదల కాకున్నా, కనీసం సినిమా టైటిల్ కూడా తెలియకున్నా ఈ కాంబినేషన్‌పై ఆసక్తి కనిపిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఆసక్తిని రెట్టింపు చేసేలా నాగార్జున-కార్తీ కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రూపొందుతోన్న సినిమాకు ఊపిరి అనే పేరును ఖరారు చేసి ఈ ఉదయం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఊపిరి’ సినిమాకు సంబంధించి ఈరోజు విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లో ప్రధానంగా నాగార్జున అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఓ వీల్‌చైర్‌కు పరిమితమైన వ్యక్తిగా నాగార్జున ఈ సినిమాలో కనిపించనున్నట్లు పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది. సెలెబ్రేషన్ ఆఫ్ లైఫ్ అన్న ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక వీల్‌చైర్‌లో కూర్చొని నవ్వుతూ ఉన్న నాగార్జున వెనుక కేరింతలు కొడుతోన్న కార్తీని చూడొచ్చు. ఎంతో అందంగా, కళాత్మకంగా ఉన్న ఈ పోస్టర్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించడమే కాక, అంచనాలను కూడా పెంచేసిందనే చెప్పాలి.

