పవన్ కళ్యాణ్ సునామికి 365 రోజులు..!

Atharintiki-Dharedhi-4
తెలుగు సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలై నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. సెప్టెంబర్ 27, 2013న అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదలైన ఈ సినిమా కొత్త చరిత్రను లిఖించింది. తెలుగు ప్రేక్షకులలో, అభిమానులలో పవన్ కళ్యాణ్ కు ఉన్న చరిష్మా, ఇమేజ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన దర్శకత్వం సినిమాను ఇండస్ట్రీ హిట్ చేశాయి. అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఆ రికార్డు ‘అత్తారింటికి దారేది’ పేరిట పదిలంగా ఉంది.

రాష్ట్ర విభజన నేపధ్యంలో జరుగుతున్న ఆందోళనలు తమ సినిమాలపై, వసూళ్ళపై ఎక్కడ ప్రభావం చూపుతాయో..? అనే భయంతో బడా సినిమాలు వెనకడుగు వేస్తున్న సమయం అది. పైగా పైరసీ బూతం వెంటాడింది. విడుదలకు ముందే సగం సినిమా ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయ్యింది. విడుదల తర్వాత పూర్తి సినిమా నెట్ లో వచ్చేసింది. అయినా సినిమా రికార్డు కలెక్షన్స్ సాధించింది. తెలుగు ప్రేక్షకులు నిజాయితికి దక్కిన విజయంగా ‘అత్తారింటికి దారేది’ విజయంను చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ కూడా ఇంతటి ఘన విజయం సాధించడానికి కారణం అయ్యింది.

పవన్ గత సినిమా ‘కెమరామెన్ గంగతో రాంబాబు’ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ‘గబ్బర్ సింగ్’ మినహాయిస్తే ‘జల్సా’ తర్వాత పవన్ కెరీర్ లో భారి హిట్ లేదు. అయినా ‘అత్తారింటికి దారేది’ సినిమా చూడాలని ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కట్టారు. ఈ సినిమా గురించి మాట్లాడితే కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అని ‘గబ్బర్ సింగ్’లో హరీష్ శంకర్ రాసిన డైలాగ్ గుర్తుకు రాక మానదు. పవన్ కటౌట్ చాలు.. అభిమానులకు.

‘ఎక్కడ నేగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.. ‘ అంటూ త్రివిక్రమ్ రాసిన మాటలు పవన్ రియల్ లైఫ్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండడంతో సినిమా అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా విజయంలో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కూడా ముఖ్య భూమిక పోషించారు. నదియా, సమంత, ప్రణిత, బోమన్ ఇరాని ఇతర నటులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సినిమాను భోగవల్లి ప్రసాద్ నిర్మించారు.

Exit mobile version