
‘జనసేన’ పేరుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ పార్టీని నెలకొల్పిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పోటీకీ దిగకపోయినా అప్పట్నుంచే రాజకీయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ‘జనసేన’ యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా, జనసేన తరపున పవన్ పలుమార్లు ప్రభుత్వంపై తనదైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగానే ప్రజల కోసం ప్రభుత్వాల్ని ప్రశ్నించడానికి ఎప్పుడూ ముందుంటానని చెప్పుకొచ్చిన పవన్, అందుకు తగ్గట్టుగానే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ వచ్చారు.
భూసేకరణ పేరుతో ప్రభుత్వం బహుళ పంటలు పండే భూములను లాక్కోవడం మంచిది కాదని ఆయన నిన్న వ్యాఖ్యానించగా, అందుకు ప్రభుత్వం తరపున పవన్ వ్యాఖ్యలను తప్పుపడుతూ సమాధానం వచ్చింది. ఈ విషయంపై సీరియస్ అయిన పవన్, తాను రైతులకు జరిగే నష్టం గురించి మాట్లాడుతుంటే ప్రభుత్వం తరపున ఇలాంటి హేళన వ్యాఖ్యలు రావడం బాగాలేదని మాట్లాడారు. ఇక ఉండవల్లి, పెనుమాక, భేతపూడి తదితర గ్రామాల్లో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దని గట్టిగా చెప్పిన పవన్, త్వరలోనే వారిని కలుస్తానని ఈ సందర్భంగా మాటిచ్చారు.
భూసేకరణ చట్టం అంటూ ఎవరికైన అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి తానున్నాని చెప్పిన పవన్, ఆ క్రమంలోనే అందుకు తగ్గ వ్యాఖ్యలు చేస్తూ ఉండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. బాబీ దర్శకత్వంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పేరుతో ఆయన ఓ సినిమా చేస్తున్నారు.

