పరిశ్రమలో ఎన్నో ఏళ్ళు కష్టపడి ‘అలియాజ్ జానకి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైనా దర్శకుడు కె. దయానంద్. తాజాగా ఈయన బుల్లితెర సీరియల్ నటుడు సాగర్ ను హీరోగా లాంచ్ చేస్తూ తీసిన చిత్రం ‘సిద్దార్థ’. ఈ చిత్రం రేపే ప్రేక్షకుల ముందుక రానున్న ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్ర) పరిశ్రమలో మీ జర్నీ ఎలా మొదలైంది ?
జ) నేను 1995 లో నటుడిగా పరిశ్రమలోకి ఎంటరయ్యాను. 1996 – 2000 వరకూ అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ గా పనిచేశాను. ఆ తరువాత ‘బద్రి’ టైం లో పవన్ కళ్యాణ్ గారితో పరిచయమై 12 ఏళ్ళు ఆయన క్రియేటివ్ టీమ్ లో వర్క్ చేశాను. ఒకరకంగా చెప్పాలంటే నాలో ఉన్న దర్శకుడిని బయటకు తీసి డైరెక్షన్ వైపుకి తీసుకొచ్చింది ఆయనే.
ప్ర) మీ మొదటి సినిమా ఏమిటి ?
జ) పవన్ కళ్యాణ్ గారి పంజా సినిమాకి వర్క్ చేసేటప్పుడు సొంతంగా సినిమా చేద్దామనుకున్నా. ఆ సమయంలో నీలిమా తిరుమలశెట్టి కలిశారు. వారితో కలిసి ‘అలియాజ్ జానకి’ చిత్రాన్ని తీశాను.
ప్ర) ఈ సినిమా మీదగ్గరకి ఎలా వచ్చింది ?
జ) నేను, సాగర్ మొదటి నుండి నుండి మంచి ఫ్రెండ్స్. ఒకసారి సాగర్ నన్ను కలిసి రామదూత క్రియేషన్స్ వాళ్ళు కొత్త సినిమా చేస్తున్నారని చెప్పాడు. అప్పుడు నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారిని కలిసి కథ వినగానే నచ్చి చేస్తానన్నాను.
ప్ర) సాగర్ నే ఈ సినిమాలో హీరో అని ఎందుకనుకున్నారు ?
జ) ఈ సినిమా కథకి, సాగర్ బాడీ లాంగ్వేజ్ కి ఈ సినిమా పర్ఫెక్ట్ గా ఉంటుందనిపించింది. పైగా అతను బాగా కష్టపడతాడు. మొదటి నుండి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అతనైతే సినిమాకి ప్లస్ అవుతాడని అనిపించి హీరోగా నిర్ణయించాం.
ప్ర) అసలు సినిమా కథేమిటి ?
జ) మొదటి నుండీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బ్రతికిన ఓ కుర్రాడు అందులో నుండి బయటకు రావాలనే ప్రయత్నంలో ఫారిన్ వెళ్ళిపోతాడు. అక్కడ ఓ అమ్మాయి పరిచయమై అనుకోని పరిస్థితుల వల్ల మళ్ళీ హింసా మార్గంలోకి నడవాల్సి వస్తుంది. అప్పుడు ఆ యువకుడు పడే సంఘర్షణే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా.
ప్ర) ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏమిటి ?
జ) సినిమా మలేషియాలో మొదలవుతుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. పక్కా కమర్షియల్ సినిమా. మలేషియాలో చేసిన యాక్షన్ ఎపిసోడ్, హైదరాబాద్ లో చేసిన యాక్షన్ ఎపిసోడ్స్, సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రభాస్ శీను, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ ల కామెడీ సినిమాకి మేజర్ హైలెట్స్.
ప్ర) హీరోయిన్లు ఎలా చేశారు ?
జ) ఇందులో ఇద్దరు హీరోయిన్లు. మెయిన్ హీరోయిన్ పాత్ర రాగిణి నంద్వాని చేసింది. ఆమె మోహన్ లాల్, విజయ్ వంటి పెద్ద నటులతో పని చేసింది. ఈ సినిమాలో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక సాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా తరువాత ఆమెకు మంచి మంచి పాత్రలొస్తాయి.
ప్ర) సినిమాకి సెన్సార్ బోర్డు ‘ఏ’ సెర్టిఫికేట్ ఎందుకిచ్చింది ?
జ) సినిమాలో అంతర్గతంగా కాస్త వయోలెన్స్ ఉంటుంది. అందుకే సెన్సార్ బోర్డు ఆ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా నడిచేది ఆ పాయింట్స్ మీదే కాబట్టి ఆ ఎలిమెంట్స్ ని తొలగించలేం.
ప్ర) సీరియల్ హీరో అయిన సాగర్ ని బిగ్ స్క్రీన్ కి ఎలా అడ్జెస్ట్ చేశారు ?
జ) కొత్తగా చేసిందేమీ లేదు. అతనికి నటనంటే తెలుసు. కష్టపడతాడు. హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ అతనికున్నాయి. కెమెరా ముందు ఈజీగానే చేశాడు. కానీ చాలా హోమ్ వర్క్ చేశాడు. ఈ సినిమాతో అతను పెద్ద స్థాయికి వెళతాడు.
ప్ర) ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసే చాన్సులున్నాయా ?
జ) ఖచ్చితంగా. ఆయన అవకాశమిస్తే చేస్తాను. ఆయన సన్నిహితంగా మెలిగే వాళ్లలో నేనూ ఒకడ్ని. సినిమా చేస్తానంటే నేను చెప్పే కథ అయితే వింటారు. ఆ తరువాత నచ్చడం, నచ్చకపోవడం మన చేతుల్లో లేదు కదా.