
తమ అభిమాన హీరో కొత్త సినిమా ఎప్పుడెప్పుడు మొదలుపెడతాడా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు గత నెల్లోనే పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమా మొదలుపెట్టి శుభవార్తను చేరవేసిన విషయం తెలిసిందే. ‘గబ్బర్ సింగ్ 2’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూణేలోని ఓ చిన్న గ్రామంలో ఈ మధ్యే పూర్తైంది. అయితే ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు.
తాజాగా గుజరాత్‌లో ఓ కొత్త షెడ్యూల్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ నుండి షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఈ నెల్లోనే ఈ షెడ్యూల్ మొదలు కానుందట. చాన్నాళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ కెమెరా ముందుకు రానుండడం విశేషం. ‘పవర్’ సినిమా ద్వారా హిట్ కొట్టిన బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌ను డైరెక్ట్ విషయమై ఆయన ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. అనిషా ఆంబ్రోస్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు శరత్ మరార్ నిర్మాత.