22 ఏళ్ల ‘సుస్వాగతం’.. పవన్‌ను ప్రేక్షకులకు దగ్గరచేసిన సినిమా

22 ఏళ్ల ‘సుస్వాగతం’.. పవన్‌ను ప్రేక్షకులకు దగ్గరచేసిన సినిమా

Published on Jan 2, 2020 3:36 PM IST

Pawan Kalyan

చిరంజీవి తమ్ముడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన పవన్ తనకంటూ ఒక సొంత గుర్తింపును తెచ్చుకుని టాప్ హీరోగా స్థిరపడ్డ వైనం మనందరికీ తెలుసు. ఇలా సొంత స్టార్ డమ్‌ను క్రియేట్ చేసుకోవడానికి పవన్ చాలానే కృషి చేయాల్సి వచ్చింది. ఆ కృషిలో ఆయనకు కొందరు దర్శకులు, వాళ్ల సినిమాలు చాలానే సహకరించాయి. అలాంటి సినిమాల్లో ‘సుస్వాగతం’ కూడా ఒకటి.

1999 జనవరి 1న విడుదలైన ఈ చిత్రం నేటితో 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై భీమినేని శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదలై రెండు దశాబ్దాలకు పైగానే గడిచిపోయినా ఈ చిత్రం ప్రేక్షకుల మదిలో, ముఖ్యంగా పవన్ అభిమానుల మదిలో పదిలంగానే ఉంది. మొదటి రెండు సినిమాలు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత’ సినిమాలతో పర్వాలేదనిపించుకున్న పవన్‌కు ‘సుస్వాగతం’ పరిపూర్ణమైన నటుడిగా గుర్తింపు తెచ్చింది.

సినిమాలో ప్రేమను చివరిదాకా గుండెల్లో దాచుకునే కుర్రాడిగా పవన్ అభినయానికి అప్పట్లో ఫిదా అన్నారు ప్రేక్షకులు. తమిళంలో 1997లో వచ్చిన విజయ్ యొక్క సూపర్ హిట్ మూవీ ‘లవ్ టుడే’ చిత్రానికిది రీమేక్. పేరుకి రీమేక్ అయినా డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు కథానాయకుడు గణేష్ పాత్రను మలిచిన విధానం, పవన్‌లోని నటుడ్ని పూర్తిగా బయపడేలా చేసిన ఆయన నేర్పు సినిమా విజయానికి చాలా తోడ్పడ్డాయి. ఇక సినిమాలో ‘ఏ స్వప్న లోకాల సౌందర్యరాశి, ఆలయాన హారతిలో’ పాటలైతే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా విజయంతో మొదలైన పవన్‌ ప్రయాణం ఆ తర్వాత ‘తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి’ అంటూ సాగిపోయి పవన్‌ను అభిమానులు పవర్ స్టార్‌ అని గర్వంగా పిలుచుకునే స్థాయికి చేరుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు