ట్విట్టర్‌లో పవన్ మళ్ళీ పొలిటికల్ కామెంట్స్..!

ట్విట్టర్‌లో పవన్ మళ్ళీ పొలిటికల్ కామెంట్స్..!

Published on Aug 19, 2015 3:50 PM IST

pawan-kalyan

ఓ పక్క సినిమాల్లో పవర్ స్టార్‌గా వెలుగొందుతూనే మరోపక్క రాజకీయపరమైన కార్యకలాపాలతోనూ నిత్యం తనను తాను బిజీగా ఉంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్. గత ఎన్నికల సమయంలో ‘జనసేన’ పేరుతో ఓ రాజకీయ పార్టీని నెలకొల్పి, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా, జనసేన తరపున పవన్ పలు రాజకీయ కార్యక్రమాలు చేపడుతోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలేవైనా జనాలకు ఇబ్బంది కలిగిస్తున్నాయంటే వెంటనే పవన్, ఆ విషయమై గత కొన్నాళ్ళుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాజధానికి భూ సేకరణ కార్యక్రమంపై ఇప్పటికే పలుమార్లు తన అభిప్రాయాలు చెప్పుకొచ్చిన పవన్, తాజాగా ఇదే విషయమై మళ్ళీ ప్రస్తావన తెచ్చారు. “ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందంటే కాలుష్యం పెరుగుతుంది. కొందరు జీవనాధారం కోల్పోతారు. కొంతమందికి ఆక్రోశం వస్తుంది. అయితే ఈ నష్టాలను ఎంతమేరకు తగ్గించడానికి ఆలోచిస్తున్నామన్న విషయంలోనే ఓ నాయకుడి వివేకం, అనుభవం తెలుస్తాయి” అంటూ ట్వీట్ చేశారు పవన్.

ఇదే సందర్భంగా భూసేకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ విస్తార పంటలు పండే నదీ పరివాహక గ్రామాలైన ఉండవల్లి, పెనుమాక, భేతపూడి తదితర గ్రామాల్లో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దని పవన్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అభ్యర్థించారు. గతంలో భూసేకరణ చట్టం అంటూ ఎవరికైన అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి తానున్నాని చెప్పిన పవన్, ఆ క్రమంలో ఇప్పుడీ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక పవన్ చేస్తోన్న సినిమాల విషయానికి వస్తే.. బాబీ దర్శకత్వంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు