స్క్రిప్ట్ లో ప్ర‌తిదీ ఎక్స్ ట్రార్డిన‌రీగానే !

స్క్రిప్ట్ లో ప్ర‌తిదీ ఎక్స్ ట్రార్డిన‌రీగానే !

Published on Sep 3, 2019 11:16 PM IST

peter

టాలీవుడ్ లో టాలెంటెడ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్స్ లో ముందు వరుసలో చెప్పుకోవాల్సిన పేరు పీట‌ర్ హెయిన్స్. కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్ల‌లోనే సౌత్ ఇండియాతో పాటు, బాలీవుడ్ సినిమాల‌కు యాక్ష‌న్ సీక్వెన్స్ ప్లాన్ చేసి ఓ బ్రాండ్‌గా ఎదిగారు. స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ కేట‌గిరీని తొలిసారి జాతీయ అవార్డుల్లో పొందుప‌రిచిన‌ప్పుడు, ఆ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న యాక్ష‌న్ డైర‌క్ట‌ర్‌గా ఆయ‌న పేరు న‌మోదైంది.

కాగా పీట‌ర్ హెయిన్స్ స్టార్ట్… కెమెరా… యాక్ష‌న్‌ అని మెగాఫోన్ ప‌ట్టుకుంటార‌ని ఎప్ప‌టి నుంచో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. డైర‌క్ట‌ర్‌గా త‌న డ్రీమ్ డెబ్యూ గురించి చాన్నాళ్లుగా ఆయ‌న కూడా ప్ర‌స్తావిస్తూనే ఉన్నారు. అది ఇప్ప‌టికి కార్య‌రూపం దాల్చింది. పీటర్ రాసుకున్న స్క్రిప్ట్ లో టేకాఫ్ అయ్యే విధానం నుంచి ప్ర‌తిదీ ఎక్స్ ట్రార్డిన‌రీగా ఉంటుందట. పీట‌ర్ హెయిన్స్ క‌ల‌ను సాకారం చేయ‌డానికి నిర్మాత న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి) ముందుకొచ్చారు.

ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ల‌క్ష్మీ, ల‌క్ష్యం, రేసు గుర్రం, ముకుంద‌… ఇలా ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించిన నిర్మాత న‌ల్ల‌మ‌లుపు బుజ్జి. తాజాగా త‌మ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో పీట‌ర్ హెయిన్స్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బేబి భ‌వ్య స‌మ‌ర్పిస్తున్నారు. అయితే హీరో, హీరోయిన్ తో పాటు ఇత‌ర ఆర్టిస్టుల‌ను ఇంకా ఎంపిక చేయాలట. ఇక గౌత‌మ్ మీన‌న్ చెలితో ఫైట్ మాస్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన పీటర్, కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో మురారితో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత అప‌రిచితుడు, శివాజీ, గ‌జిని, మ‌గ‌ధీర‌, రోబో, విల‌న్‌, విక్ర‌మ సింహ‌, బాహుబ‌లి, మ‌న్యం పులి…ఇలా సూపర్ హిట్ చిత్రాలకు ఆయ‌న పని చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు