మంచు మనోజ్‌కు ప్రధాని మోడీ విషెస్..!

manoj-modi
మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ వివాహం నిన్న ఉదయం ప్రణతి రెడ్డితో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. నిన్నటితో ఆయన తన బ్యాచిలర్ జీవితానికి స్వస్తి పలికి మూడు ముళ్ళ బంధంతో ఓ ఇంటివాడైపోయాడు. మోహన్ బాబు ఫ్యామిలీలో మనోజ్‌ తరంలో జరుగుతున్న చివరి పెళ్ళి కావడంతో కుటుంబమంతా ఈ వేడుకను మరచిపోలేని రీతిలో ఘనంగా నిర్వహించారు. హైద్రాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వాణిజ్య ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు.

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేశారు. అతిథులందరికీ అద్భుతమైన ఏర్పాట్లు చేసి మంచు ఫ్యామిలీ ఆతిథ్యం రుచి చూపారు. ఇక ఇదే వేడుకకు భారత ప్రధాని నరేంద్ర మోడీని, మోహన్‌బాబు తన కుటుంబంతో కలిసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే బిజీ షెడ్యూల్స్‌ వల్ల ఆయన ఈ వేడుకకు హాజరు కాలేదు. కాగా ఇదే విషయాన్ని ఆయన మోహన్‌బాబుకు ఓ లెటర్ ద్వారా తెలియజేశారు. మనోజ్-ప్రణతిల జంటకు తన శుభాకాంక్షలను తెలిపారు మోడీ.

ఈ విషయం గురించి మోహన్ బాబు తన ట్విట్టర్ ఎకౌంట్‌లో స్పందిస్తూ.. “నరేంద్ర మోడీ గారు ఇంతటి బిజీ షెడ్యూల్‌లో కూడా మనోజ్ పెళ్ళిని గుర్తు పెట్టుకొని ఒక లెటర్ పంపడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. యువ రాజకీయ నాయకులు ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది.” అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

Exit mobile version