హారర్, యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన కొత్త చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ పతాకంపై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, సంజీవ్ మేగోటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. జూన్ 12న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ట్రైలర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆయన సినిమాల పేర్లతో కూడిన ఒక ప్రత్యేక గీతాన్ని అభిమానుల సమక్షంలో విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ డీఐజీ రమణారెడ్డి చేతుల మీదుగా ‘నువ్వట్టా సూత్తా ఉంటే’ అనే మరో పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్‌తో ఈ కథను తెరకెక్కించినట్లు తెలిపారు. 52 మంది సీనియర్ నటీనటులతో 45 రోజుల్లోనే సినిమా చిత్రీకరణను పూర్తి చేశామన్నారు. కృష్ణ టైటిళ్లతో సాగే ప్రత్యేక పాటలో నటుడు కృష్ణసాయి నటించినట్లు వెల్లడించారు.
ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్ని నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


