మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ రామ్ చరణ్ కి తాతయ్య పాత్రలో కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండడమే కాకుండా న భూతో న భవిష్యత్ అనే రేంజ్ లో ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
కొద్ది రోజులు షూటింగ్ ఆపేసిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మళ్ళీ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం నానక్రామ్ గూడాలో వేసిన ఓ హౌస్ సెట్ లో పండగ వాతావరణంలో షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాని విజయదశమి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ సరసన జయసుధ నటిస్తున్న ఈ మూవీలో శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


