
‘అహ నా పెళ్ళంట’, ‘పూల రంగడు’ సినిమాలతో కామెడీ సినిమా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వీరభద్రం, మూడో సినిమా ‘భాయ్’ పరాజయం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే! తాజాగా ఆయన లవర్ బాయ్ ఆది హీరోగా ఓ సినిమా మొదలుపెట్టారు. గత నెలలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.
కొంతకాలంగా ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది ప్రస్తుతం ‘గరమ్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! ‘గరమ్’ పూర్తైన వెంటనే వీరభద్రం సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు హీరోయిన్‌గా పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన ప్రణతి హీరోయిన్‌గా నటించనున్నారు.
ఈమధ్యే విష్ణు సరసన హీరోయిన్‌గా డైనమైట్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రణీత, మహేష్ బ్రహ్మోత్సవంలోనూ ఓ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఇక ఆది సినిమా విషయానికి వస్తే మంచి కామెడీ కథతో తెరకెక్కనున్న ఈ సినిమా తనకు ఓ కొత్త గుర్తింపు తెచ్చిపెడుతుందని ఆది నమ్మకంగా ఉన్నారట. ఈ సినిమాకు వీరభద్రం తన స్టైల్లో ‘చుట్టాలబ్బాయి’ అంటూ మంచి టైటిల్ పెట్టి సినిమాపై ఆసక్తిని కలిగించారు.