రవితేజతో సినిమా గురించి చందూ మొండేటి ఏమన్నారంటే..!

ravi-teja-chandu-mondeti
‘కార్తికేయ’ లాంటి సూపర్ హిట్‌తో తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన చందూ మొండేటి, తాజాగా ‘ప్రేమమ్‌’తో మరోసారి తన సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక రెండు వరుస విజయాలతో ఉత్సాహం మీదున్న ఆయన, ప్రస్తుతం తన కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో పడిపోయారు. రవితేజ హీరోగా ఈ సినిమా తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే విషయమై చందూ మొండేటిని సంప్రదించగా, రవితేజకు ఒక స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నానని, అన్నీ కుదిరితే తమ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలవుతుందని స్పష్టం చేశారు.

‘బెంగాల్ టైగర్’ విడుదలై సంవత్సరం కావొస్తున్నా రవితేజ ఇప్పటికీ ఒక్క సినిమాను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్ళలేదు. ఈ క్రమంలోనే చాలామంది దర్శకులతో ఆయన సినిమా గురించి వార్తలొచ్చాయి. చివరగా ఇప్పుడు చందూ మొండేటి పేరు వినిపిస్తోంది. ఎలాగైనా తన స్థాయికి తగ్గ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో రవితేజ కావాలనే ఈ గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి రవితేజ-చందూ మొండేటి కాంబినేషన్ సెట్స్‌పైకి వెళుతుందో లేదో చూడాలి.