సమీక్ష : `ప్రేమనే ఊరిలో` –  అక్కడక్కడ మెప్పించే ఎమోషనల్ లవ్ డ్రామా ! 

సమీక్ష : `ప్రేమనే ఊరిలో` –  అక్కడక్కడ మెప్పించే ఎమోషనల్ లవ్ డ్రామా ! 

Published on Oct 4, 2026 2:54 PM IST

విడుదల తేదీ : అక్టోబర్ 02 , 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : శ్రీరామ్, రంగయనా రఘు, తపస్విని పూనాచా, రమికా శివు, గోవిందే గౌడ, సువీష్ చంద్ర, అభిషేక్ కల్మణి, అభి మహేష్ తదితరులు
దర్శకత్వం : మనోజ్ కుమార్
నిర్మాతలు : మమతా దేవేంద్ర ఎం, సురేష్ కొండేటి
సంగీతం : సునాద్ గౌతమ్
ఛాయాగ్రహణం : రాజ్‌కాంత్ ఎస్‌కే
కూర్పు : హర్షిత్ ప్రభు

సంబంధిత లింక్స్ : ట్రైలర్

కన్నడలో మంచి విజయాన్ని అందుకున్న `ప్రేమద ఊరలి` సినిమాను తెలుగులో `ప్రేమనే ఊరిలో` పేరుతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రంగాయన రఘు, శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :-

భార్యను కోల్పోయిన నాగన్న (రంగాయన రఘు) తన కొడుకు సంతోష్‌ను (శ్రీరామ్) అల్లారుముద్దుగా పెంచుతాడు. దాంతో శ్రీరామ్‌కు చదువుల్లో రాణించలేకపోతాడు. దీంతో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. సంతోష్‌ మరదలు వసంత (రమిక శివు) అతని పై మనసు పడుతుంది. కానీ తన కుమారుడికి ఉన్నత విద్యను అభ్యసించిన భార్యను తీసుకురావాలని నాగన్న ఆశపడతాడు. ఐతే, తనకంటూ కొన్ని షరతులు పెట్టుకున్న సంతోష్‌ కు ఏ సంబంధం సెట్ అవ్వదు. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల అనంతరం.. విదేశాల నుంచి వచ్చిన రుక్మిణి (తపస్విని పూనాచ)ని చూసి సంతోష్ తొలిచూపులోనే ఇష్టపడతాడు. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తండ్రి కోరిక మేరకు సంతోష్‌ పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత సంతోష్ లైఫ్ లో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ?, మరోవైపు భార్య మరణం తర్వాత నాగన్నను వెంటాడిన అత్యంత విషాదం ఏమిటి ?, సంతోష్‌ను నాగన్న ఎలా పెంచి పెద్ద చేశాడు ?, వసంతతో సంతోష్ బంధం ఎలా కొనసాగింది ?, బావ సంతోష్‌పై వసంత ఎలా ప్రేమను పెంచుకొన్నది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో స్వచ్ఛమైన పాత్రలతో ఈ చిత్రాన్ని మలచడం బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కొన్ని చోట్ల ఫీల్ గుడ్ లవ్ ఎలిమెంట్స్ ను దర్శకుడు బాగానే రాసుకున్నాడు. ముఖ్యంగా పల్లెటూరి విజువల్స్, ముక్కోణపు ప్రేమకథ తాలూకు ఎలిమెంట్స్, ద్వితీయార్థంలో వచ్చే మెయిన్ ఎమోషన్స్, తండ్రి గతం తాలూకు ఫ్లాష్‌బ్యాక్ సినిమాకి ప్లస్ అయ్యాయి. మెయిన్ గా చివరి 30 నిమిషాలు సినిమాకి బాగా ప్లస్ అయింది.

హీరోగా శ్రీరామ్ పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన లవ్ ట్రాక్, అలాగే తండ్రి – కొడుకుల మధ్య ఎమోషన్స్ తో పాటు మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ఈ చిత్రం కొన్ని చోట్ల ఆకట్టుకుంది. రంగయనా రఘు తన ఈజ్ యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. నాగన్న పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. హీరోగా శ్రీరామ్ మెప్పించాడు.

హీరోయిన్ గా నటించిన తపస్విని పూనాచా తన లుక్స్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో హీరోయిన్ పాత్రలో రమికా శివు కూడా చాలా బాగా నటించింది. కీలక పాత్రలో నటించిన గోవిందే గౌడ నటన చాలా బాగుంది. మిగిలిన ప్రధాన పాత్రల్లో కనిపించిన సువీష్ చంద్ర, అభిషేక్ కల్మణి, అభి మహేష్ కూడా తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ ప్రేమనే ఊరిలో సినిమా ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోవడం ప్రధాన మైనస్ పాయింట్. పైగా కొన్ని సీన్లు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆల్ రెడీ అర్థమైన విషయాలను మరింత డిటైల్డ్ గా చూపించడం వల్ల ఇంట్రెస్ట్ తగ్గింది. దీనికితోడు కథ కొంత ప్రిడిక్టబుల్ గా పాత తరహాలో సాగడం బాగాలేదు.

అలాగే సినిమాలో మెయిన్ గా వచ్చే ఫ్లాష్‌ బ్యాక్ ట్రీట్‌మెంట్ కూడా కొత్తదనం లేకుండా సాగుతుంది. ఇక తెలుగు డబ్బింగ్‌ లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్నిచోట్ల లిప్-సింక్ కరెక్ట్ గా లేదు. ఇక యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ లేకుండా సాగే సింపుల్ లవ్–ఫ్యామిలీ డ్రామా కావడంతో యువ ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన మిశ్రమంగా ఉండొచ్చు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి చెప్పుకుంటే.. సంగీత దర్శకుడు సునాద్ గౌతమ్ అందించిన సంగీతం బాగుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ఎడిటర్ తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు మనోజ్ కుమార్ తన దర్శకత్వంతో ఆకట్టుకున్నా.. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. ఇక సినిమాలోని నిర్మాతలు మమతా దేవేంద్ర ఎం, సురేష్ కొండేటి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు:

`ప్రేమనే ఊరిలో` అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో..  ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్,  హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్  ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య సీన్స్ బాగున్నాయి. కానీ, మెయిన్ క్యారెక్టరైజేషన్స్, ప్లే  బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని రెగ్యులర్ సీన్స్  వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే,  ఓ స్వచ్చమైన పల్లెటూరి సినిమా చూడాలనుకునే వారికి ఈ సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు