శర్వానంద్ హీరోగా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ (Naari Naari Naduma Murari). సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత అనిల్ సుంకర తాజాగా మీడియాతో పంచుకున్నారు. ఇది పక్కా పండుగ సినిమా అని, థియేటర్లో ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో ఆసక్తికర విషయమేమిటంటే, హీరో శ్రీవిష్ణు ఇందులో ఓ కీలకమైన, వినోదాత్మక పాత్రలో కనిపించనున్నారు. శర్వానంద్, శ్రీవిష్ణు కాంబినేషన్ సన్నివేశాలు హిలేరియస్‌గా ఉంటాయని, ఓ సాధారణ మనిషిలా వచ్చి శ్రీవిష్ణు ఎంటర్టైన్ చేస్తారని అనిల్ సుంకర పేర్కొన్నారు. నైజాం, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. డిజిటల్ రైట్స్ అమెజాన్ సొంతం చేసుకుంది.
సంక్రాంతి పోటీపై స్పందిస్తూ.. కంటెంట్ బాగుంటే పండుగ సీజన్లో నాలుగైదు సినిమాలు హిట్టయిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. ఇకపై పూర్తి స్క్రిప్ట్ సిద్ధమయ్యాకే షూటింగ్‌కు వెళ్తానని స్పష్టం చేసిన ఆయన, భవిష్యత్తులో సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జా, అడివి శేష్ (గూఢచారి 2)లతో పాటు ‘ఎయిర్ ఫోర్స్ బెజవాడ బ్యాచ్’ అనే కామెడీ సినిమా చేయనున్నట్లు తెలిపారు.
