ఇంటర్వ్యూ : నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ – ‘కర’తో ధనుష్ సాలిడ్ హిట్ అందుకుంటాడు..!

తమిళ హీరో ధనుష్, మమితా బైజు జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కర’. విఘ్నేశ్ రాజా డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఏప్రిల్ 30న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ అధినేత సీహెచ్. సతీష్ కుమార్ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

నేను విశాఖపట్నం నుంచి డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, ‘అర్జున్ రెడ్డి’, ‘సలార్’, ‘కాంతారా చాప్టర్ 1’ వంటి భారీ చిత్రాలను ఉత్తరాంధ్రలో పంపిణీ చేశాను. ‘ధర్మయోగి’తో నిర్మాతగా మారి, ఇప్పుడు నా స్నేహితుడు రాజేష్ సహకారంతో ‘కర’ అనే వైవిధ్యమైన చిత్రాన్ని నిర్మిస్తున్నాను.

ధనుష్ కి ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. పైగా ‘కర’ చిత్రంలో బలమైన కంటెంట్ ఉండటంతో ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నాను. ‘కుబేర’, ‘రాయన్’ చిత్రాలు తెలుగులో ఆకట్టుకున్నాయి. అదే స్ఫూర్తితో ఈ సినిమాను నా శక్తి మేరకు తెలుగు ప్రేక్షకులందరికీ చేరువ చేస్తాను.

ధనుష్ సినిమా కోసం పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, పర్సనల్‌గా కేర్ తీసుకుని నిర్మాత గణేష్ గారిని సంప్రదించడంతో నా ప్రయత్నాన్ని మెచ్చి ఈ చిత్రాన్ని నాకు ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 80 శాతం బిజినెస్ పూర్తవ్వడం విశేషం.

నైజాంలో దిల్ రాజు గారు పంపిణీ చేస్తుండగా, మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రముఖులకు బాధ్యతలు అప్పగించాం. నేను స్వయంగా ఉత్తరాంధ్రలో విడుదల చేస్తున్నాను. మొత్తం 400కు పైగా థియేటర్లలో, హిందీ వెర్షన్‌తో కలిపి సుమారు 600కు పైగా స్క్రీన్లలో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

కరస్వామి అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందుకే తెలుగులో ‘కర’ అనే టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమాతో ధనుష్ సాలిడ్ హిట్ అందుకుంటాడని నమ్ముతున్నాం.

నాకు ‘పోరు తొళిల్’ చిత్రం మరియు దర్శకుడు విఘ్నేశ్ మేకింగ్ అంటే చాలా ఇష్టం. ఆయనపై ఉన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ‘కర’ చిత్రంలో కుటుంబ భావోద్వేగాలతో పాటు ఉత్కంఠభరితమైన అంశాలు పుష్కలంగా ఉన్నాయి, ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ధనుష్ గారు కూడా పూర్తి ధీమాతో ఉన్నారు.

ఈ సినిమాలో కేవలం గ్రామీణ నేపథ్యమే కాకుండా, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ స్థాయి సమస్యలను కూడా చర్చించారు. జీవీ ప్రకాష్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలం. కొన్ని పాటలను నేరుగా వెండితెరపై చూస్తేనే ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.

Exit mobile version