
రామ్ గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్.. వీరిద్దరూ ఎవరికి వారే తమ తమ పంథాలో తెలుగులో అశేష అభిమానుల్ని సొంతం చేసుకున్న సంచలన దర్శకులు. ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్ తను దర్శకుడిగా మారకముందు రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ ఇప్పటివరకూ వీరిద్దరి బంధం అలా కొనసాగుతూనే వస్తోంది. గురువు సినిమాను శిష్యుడు ప్రమోట్ చేయడం, శిష్యుడి సినిమాను గురువు మెచ్చుకోవడం ఇలా జరుగుతూనే వస్తూ ఉంది.
అయితే తాజాగా వీరిద్దరూ తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీకి నిలబడడం ఆసక్తికరంగా కనిపిస్తోన్న విషయం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి డిసెంబర్ 18న భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ ఈజ్ బ్యాక్ అన్న నినాదంతో వస్తోన్న ఈ సినిమాపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్‌కు సరిగ్గా ఒక్కరోజు ముందున అంటే డిసెంబర్ 17న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘లోఫర్’ సినిమా విడుదల కానుంది. దీంతో ఈ రెండు సినిమాలూ ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం తథ్యంగా కనిపిస్తోంది. మరి ఈ గురు-శిష్యుల సినిమాల మధ్యన పోటీలో ఎవరో ఒకరు నిలుస్తారా? లేక ఇద్దరూ గెలుస్తారా? అన్నది చూడాలి.