వైవిధ్యమైన పోస్టర్లు, ఫన్నీ క్యాప్షన్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘పురుష:’. మధ్య తరగతి జీవితాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా హీరోయిన్ హాసిని సుధీర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ఆమె ప్రముఖ కమెడియన్ సప్తగిరికి జోడిగా కనిపిస్తున్నారు.
చేతికి బాక్సింగ్ గ్లౌస్ ధరించి ఉన్న హాసిని లుక్, దానిపై ‘పాపం అల్లాడి పోతున్నాడమ్మ బిడ్డ’ అనే క్యాప్షన్ చూస్తుంటే.. సినిమాలో సప్తగిరి పాత్రను ఆమె ఓ ఆట ఆడుకోబోతున్నట్లు అర్థమవుతోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని మేకర్స్ తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన మరో నటి వైష్ణవి ఎమోషనల్ లుక్‌కు కూడా మంచి స్పందన లభించింది.
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్నారు. వెన్నెల కిషోర్, వి.టి.వి. గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
