పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పురుష:’. వీరు వులవల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు, సరస్వతి బత్తుల నిర్మిస్తున్నారు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 22న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సహకరించిన తోటి నటీనటులకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమాను వినోదాత్మకంగా రూపొందించినట్లు చెప్పారు. సినిమాపై ఇష్టంతో, కథపై ఉన్న నమ్మకంతోనే ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించామని నిర్మాత కోటేశ్వరరావు వెల్లడించారు.
దర్శకుడు వీరు మాట్లాడుతూ.. సప్తగిరి, కసిరెడ్డి కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుందని, నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారని తెలిపారు. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. వేసవి కానుకగా వస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
