వర్మతో ట్వీట్ ఫైట్‌ గురించి రాజ్ తరుణ్..!

వర్మతో ట్వీట్ ఫైట్‌ గురించి రాజ్ తరుణ్..!

Published on Nov 17, 2015 7:43 PM IST

raj-tarun

రాజ్ తరుణ్.. ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావా’ రెండు సూపర్ హిట్స్ కొట్టి తాజాగా ‘కుమారి 21F’తో హ్యాట్రిక్ ఫీట్ కోసం సిద్ధమైన యువహీరో. ఇక కుమారి 21F తర్వాత వరుసగా సినిమాలను లైన్లో పెట్టిన రాజ్ తరుణ్, సుమారు నాలుగు ప్రాజెక్టులతో బిజీ బిజీగా మారిపోనున్నారు. ఇక ఈ సినిమాల్లోనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో రాజ్ తరుణ్ చేయబోయే సినిమా కూడా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఇక రామ్ గోపాల్ వర్మతో తాను సినిమా చేయనున్నట్లు ప్రకటిస్తూ రాజ్ తరుణ్ చేసిన పలు ట్వీట్స్ కొద్దికాలం క్రితం వార్తల్లో నిలిచాయి. ఆ ట్వీట్స్‌లో వర్మను ఒక మామూలు దర్శకుడిగా, ఆయన సినిమాల్లో పెద్ద విషయమేదీ ఉండదన్నట్లుగా మాట్లాడడంపై వర్మ అభిమానులు రాజ్ తరుణ్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో ఈ ట్వీట్ ఫైట్‌లో రాజ్ తరుణ్ తప్పేమీ లేదని, తానే స్వయంగా ఆ ట్వీట్స్ చేశానని రామ్ గోపాల్ వర్మ కూడా స్పష్టం చేశారు. తాజాగా రాజ్ తరుణ్ సైతం ఈ ట్వీట్స్‌పై సరైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

వర్మపై తన ట్వీట్స్ గురించి మాట్లాడుతూ.. “ఆ ట్వీట్స్ వర్మ గారే నా ఫోన్ తీసుకొని సరదాగా చేశారు. ఆయనలాంటి గొప్ప దర్శకుడి గురించి నేనలా ఎలా మాట్లాడతాను? నన్నడిగితే.. ఆయన మన సినిమాకు ఓ సరికొత్త గమ్యాన్ని, మార్గాన్ని చూపిన దర్శకుడు. అలాంటి దర్శకుడి గురించి సరదా నేనెలా చేస్తాను? ఆయనతో ఓ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తా” అని రాజ్ తరుణ్ తెలిపారు.

తాజా వార్తలు