
సల్మాన్ ఖాన్ హీరోగా, కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన బాలీవుడ్ సినిమా ‘భజరంగీ భైజాన్’. దేశవ్యాప్తంగా గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతోంది. తెలుగు స్టార్ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. బాక్సాఫీస్ కలెక్షన్లతో పాటు మనసుల్ని కదిలించే కథంటూ చూసిన వారంతా ఈ సినిమాను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
తాజాగా ఈ జాబితాలో బాహుబలితో తానేంటో దేశవ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకుడు రాజమౌళి సైతం చేరిపోయారు. “హృదయానికి హత్తుకుపోయే కథతో రూపొందిన భజరంగీ భైజాన్ సినిమా చూశాను. టీమ్ మొత్తం ఒక జెన్యూన్ కథ కోసం అన్ని కమర్షియల్ అంశాలనూ పక్కనపెట్టడం బాగా నచ్చింది. అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా కథ ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళిన సల్మాన్ ఖాన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక చిన్నారి హర్షాలి మనసుల్ని దోచేసుకుంది” అంటూ రాజమౌళి భజరంగీ భైజాన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

