‘షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా – రాజేంద్ర ప్రసాద్

rajendra

మన టాలీవుడ్ సీనియర్ నటుడు నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ మూవీని మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకంపై రూపేశ్ నిర్మించిన ఈ చిత్రానికి పవన్ ప్రభ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అర్చన, రూపేశ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే..

మొదటిగా మీడియా కోసం మాట్లాడుతూ.. ’48 ఏళ్ల నుంచి నన్ను ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు థాంక్స్. నాకు ఎప్పుడూ మంచి పాత్రలే వస్తున్నాయి. నా వయసుకు తగ్గ పాత్రలే వస్తుండటం నా అదృష్టం. ‘షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని ఈ రోజు నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా. నేను ఎంతో సంతృప్తిగా ఫీల్ అయిన చిత్రమిది అని తెలిపారు.

అలాగే మా ఈ హీరో, నిర్మాత రూపేశ్ గారు ఆర్‌బీ చౌదరి గారికి కజిన్. అమరావతిలో ఈ సినిమాకు సంబంధించిన మొదటి ఫంక్షన్ చేయాలని అనుకున్నాం. కానీ అక్కడ అన్ని సౌకర్యాలు లేవు. అందుకే విజయవాడలో ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించాం. ట్రైలర్ చూస్తే ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ అని అందరికీ అర్థం అవుతుంది. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. తెలుగు వారిని ప్రతిబింబించేలా ఈ మూవీ ఉంటుంది.

నటునిగా, నిర్మాతగా తన ప్రయాణం ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడుతూ.. నేను ఒకప్పుడు చిత్రాలు నిర్మించాను. కానీ ఇప్పుడు సినిమా నిర్మాణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు. అయితే ఇప్పుడున్నంత డిస్టర్బెన్స్ కూడా అప్పట్లో లేదు. నేను ఇప్పటికీ షాట్ చేసిన తరువాత మానిటర్ చూడను. నాకు ఆ అలవాటు కూడా లేదు. మానిటర్ చూసుకుని వన్స్ మోర్ అని చెప్పాల్సింది దర్శకుడు. మన పని మనం చేసుకోవాలి. అభివృద్దిని మనం మంచి కోసం వాడుకోవాలి. ప్రస్తుతం మన తెలుగు సినిమా ప్రపంచస్థాయికి వెళ్లింది.

పవన్ కళ్యాణ్ విషయంలో ఏపీలో థియేటర్స్ ఇష్యూపై మాట్లాడుతూ.. థియేటర్లు మూసేయడం అనేది ఒక్కరి నిర్ణయంతో జరిగేది కాదు. అందరూ కలిసి సమిష్టిగా తీసుకోవాలి. కానీ తప్పుడు విధానంలో వార్త బయటకు వచ్చింది. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించారు.

అలాగే పలు యునిక్ అంశాలు కోసం మాట్లాడుతూ.. “నేను ఇంగ్లీష్ భాషలో ‘క్విక్ గన్ మురుగన్’ అనే చిత్రంలో నటించాను. ఎమిరైట్స్ ఫ్లైట్స్‌లో నా చిత్రం ఉంటుంది. ఇప్పటికే అందులోంచి మూడు పార్టులు రావాల్సి ఉంది. రెండో పార్ట్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఏఐ టెక్నాలజీని వాడి అందులో కొన్ని సీన్లను తీయబోతోన్నారు. మూడు సీన్ల కోసం నన్ను ‘సింగిల్’ మూవీకి అడిగారు. నేను చేస్తే ఆ పాత్రకు ప్రాధాన్యం వస్తుందంటే కచ్చితంగా చేస్తాను. ‘సింగిల్’ మూవీలో నా కారెక్టర్ చూసి అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి అభినందించారు. పాత్రతో పాటు పాత్రను ఎవరు పోషించారు? అన్నది కూడా ముఖ్యమని అరవింద్ గారు అన్నారు. మనం ఏ పాత్రలు పోషించినా.. ఆ పాత్రలే జనాలకు గుర్తుండాలనేది నా సూత్రం. ఇది నా ఐదో జనరేషన్. ఇప్పటికీ నా కోసం ‘షష్టిపూర్తి’ లాంటి పాత్రలు రాస్తున్నారంటే అది నా అదృష్టం. పిల్లలు తల్లిదండ్రుల పెళ్లిని చూడలేరు. కానీ 60వ పెళ్లిని మాత్రం చూడగలరు. అందుకే ‘షష్టిపూర్తి’కి అంత ప్రాధాన్యం. ఇలాంటి చిత్రాల్ని, పాత్రల్ని అస్సలు మిస్ అవ్వకూడదు” అని తెలిపారు.

కళ అనేది సముద్రం. మనం సముద్రం మొత్తాన్ని తాగగలమా? ఈదగలమా?.. కళ కూడా అంతే. ఎప్పటికీ ఆకలి, దాహం తీరదు. ఎప్పటికీ నటుడిగా ఇంకెన్నో పాత్రలు పోషించాలి. ‘షష్టిపూర్తి’ చిత్రంలో మూడు రకాల వేరియేషన్స్ ఉంటాయి. ‘లేడీస్ టైలర్’ మూవీ మాడ్యులేషన్, గెటప్ కావాలని దర్శకుడు పట్టుబట్టుకుని కూర్చున్నారు. కానీ నా యాటిట్యూడ్ వల్ల ఆ పాత్రను ఈజీగా పోషించాను. ఇందులో మూడు ఏజ్‌ గ్యాప్‌లను చూపించాం. ఇది నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది.

మాస్ట్రో, లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం కోసం మాట్లాడుతూ.. ఇళయరాజా గారు మాతో పోటీ పడి మరీ సంగీతాన్ని అందించారు. కీరవాణి గారు మా కోసం పాట రాశారు. కీరవాణి పాట రాస్తున్నారా? అని రాజా గారు కూడా షాక్ అయ్యారు. మా ‘షష్టిపూర్తి’ కోసం రాజా గారు అద్భుతమైన పాటల్ని అందించారు. చైతన్య ప్రసాద్ గారు మంచి సాహిత్యాన్ని ఇచ్చారు”.

నా జీవితంలో ఎప్పుడూ కూడా జేబు నిండిందా? లేదా? అన్నది చూడలేదు. చేస్తున్న జాబు (పని) సంతృప్తిని ఇచ్చిందా? లేదా? అన్నది చూశాను. ఏడాదికి పన్నెండు చిత్రాలు చేశాను.. ఎంతో డబ్బులు సంపాదించాను. ఆ డబ్బులు అన్నీ కూడా పోయాయి. కానీ నేను ఎప్పుడూ డబ్బుల గురించి ఆలోచించలేదు. నేను చేస్తున్న పని, వేస్తున్న పాత్రలే సంతృప్తినిస్తుంటాయి. ఆ దేవుడి దయ వల్ల నాకు ఇప్పటికీ పని దొరుకుతోంది. గత 48 ఏళ్లుగా పని దొరుకుతూనే ఉంది. ఇప్పుడు నా చేతిలో 11 ప్రాజెక్టులున్నాయి. ఇంకో నాలుగు చిత్రాలు చర్చల్లో ఉన్నాయి.

‘షష్టిపూర్తి’ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. నవ్విస్తాను, ఏడ్పిస్తాను. ఈ మూవీని చూసిన తరువాత ప్రతీ ఒక్కరూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారిని ప్రేమగా పలకరిస్తారు.

చాలా కాలం తర్వాత అర్చనతో నటనపై మాట్లాడుతూ.. నేను, అర్చన కలిసి ‘లేడీస్ టైలర్’ చేశాం. మళ్లీ ఇన్నేళ్లకు ‘షష్టిపూర్తి’ మూవీని చేశాను. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? మధ్యలో ఎందుకు కలిసి చేయలేకపోయామో నాకు కూడా తెలియడం లేదు. ఆమె దాసి, నిరీక్షణ అంటూ వేరే జానర్‌లోకి వెళ్లిపోయారు. నేను నా కామెడీ జానర్‌లోకి వెళ్లిపోయాను. నేను ఎప్పుడూ కూడా నా సినిమాలో ఆ హీరోయిన్‌ను పెట్టండి.. ఈ హీరోయిన్‌ను పెట్టండి అని అడగను. ఆ అలవాటు నాకు లేదు. మళ్లీ ఇన్నేళ్లకు ఇలా ‘షష్టిపూర్తి’ చేయడం ఆ దైవ నిర్ణయమే అనిపిస్తుంది. మధ్యలో ఆమెను నేను కలిసింది కూడా లేదు.

ప్రస్తుతం కామెడీ తగ్గింది. దానికి ప్రధాన కారణం రచయిత. మా టైంలో అద్భుతమైన కామెడీని రాసేవారు. అప్పట్లో హెల్దీ కామెడీతోనే అందరినీ నవ్వించాను. ఇప్పుడు అలాంటి కామెడీ టైమింగ్, కామెడీ రైటింగ్ కానీ కనిపించడం లేదు. ‘రాబిన్ హుడ్‌’లో వెన్నెల కిశోర్‌తో నా ట్రాక్‌ను అందరూ ఎంజాయ్ చేశారు. మంచి కామెడీ ఇప్పుడు మిస్ అవుతోందని నేను కూడా ఎక్కువగా బాధపడుతుంటాను. ‘అహనా పెళ్లంట’ బ్లాక్ బస్టర్ తరువాత నాకు ఎక్కువ భయం వేసింది. మళ్లీ అలాంటి సినిమా వస్తుందా? అని అనుకున్నాను. ప్రస్తుతం ఉన్న కామెడీ ఇంకా బెటర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అని ముగించారు.

Exit mobile version