మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. స్పోర్ట్స్ నేపథ్యంలో గ్రామీణ వాతావరణంలో సాగే ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వస్తున్న పుకార్లకు రామ్ చరణ్ చెక్ పెట్టారు. ఈ చిత్రం అనుకున్న సమయానికే, అంటే ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఆయన ఇటీవల స్పష్టం చేశారు.
హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, చిత్ర బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్ ఆధారంగా రూపొందించిన ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ లుక్ పవర్‌ఫుల్‌గా ఉంది. ఆయన కండలు తిరిగిన దేహం మరియు నిలబడిన తీరు హనుమంతుడి రూపాన్ని తలపించేలా ఉండి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అయితే, ఈ పోస్టర్‌లో రిలీజ్ డేట్ లేకపోవడంతో ఇప్పుడు అభిమానులు డైలమాలో పడిపోయారు.
ఈ భారీ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ మరియు జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ పక్కా క్లారిటీ ఎందుకు ఇవ్వడం లేదనే విషయంపై అభిమానుల్లో చర్చ సాగుతుంది.
