విడుదల తేదీ : జూన్ 4, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతిబాబు, శివ రాజ్ కుమార్, దివ్యెందు శర్మ, బొమన్ ఇరానీ, సత్య తదితరులు
దర్శకత్వం : బుచ్చిబాబు సానా
నిర్మాణం : వృద్ది సినిమాస్
సంగీతం : ఏ ఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం : రత్నవేలు
కూర్పు: నవీన్ నూలి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
టాలీవుడ్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అందులోని ఒక సాలిడ్ హిట్ అవుతుందని భావిస్తున్న సినిమానే పెద్ది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా తన మొదటి సినిమా ఉప్పెన తో సత్తా చాటిన దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో ఇప్పుడు పరిశీలిద్దాం రండి.
కథ:
ఒలింపిక్స్ లో ఇన్ని కోట్ల మంది ఉన్న భారత్ నుంచి వచ్చే కేవలం ఒకటీ రెండు మెడల్స్ మాత్రమే వస్తుండడంతో భారత్ కి చెందిన మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ వారు బాగా డిజప్పాయింట్ అవుతారు. ఈ క్రమంలో ఆ అకాడమీకి చెందిన ఆఫీసర్ పైస్వాల్ (బొమన్ ఇరానీ) కి విజయనగర ప్రయాణంలో పెద్ది (రామ్ చరణ్) అనే ఒక మల్టీ స్పోర్ట్స్ ఆటగాడు కోసం తెలుస్తుంది. క్రికెట్, మల్లయుద్ధం, పరుగు పందెం ఇలా మూడింట్లో కూడా పెద్ది పేరు మారుమోగడం చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడ నుంచి అసలు పెద్ది కోసం తాను ఏం తెలుసుకున్నాడు? ఆట, అందులో గెలుపుతో పెద్ది గాడు చేసిన పోరాటం ఏంటి? తను కోరుకున్న గుర్తింపు కోసం తాను ఎంతవరకు సిద్ధపడ్డాడు? ఆఖరికి తను అనుకున్నది సాధించాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో ప్రధానంగా దర్శకుడు బ్యాలెన్సుడ్ గా నడిపించిన ఎమోషన్స్ ఇంకో పక్కన ఉత్కంఠ గొలిపే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సీన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. పైగా ఇందులో అంతర్లీనంగా సెటప్ చేసుకున్న కోర్ ఎమోషనల్ పాయింట్ ని బుచ్చిబాబు ఎక్కడా పక్కదారి పట్టకుండా చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇంప్రెస్ చేస్తుంది.
ఇక పెర్ఫామెన్స్ ల పరంగా చూస్తే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి మరో డీసెంట్ పెర్ఫామెన్స్ అందించిన రోల్స్ లో పెద్ది రోల్ కూడా ఒకటి. ఈ సినిమా కోసం రామ్ చరణ్ పడిన శారీరక కష్టం మాత్రం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కుస్తీ కోసం సిద్ధమైన తీరు అందులోని యాక్షన్ ఎపిసోడ్స్ లో తాను తన పాత్ర కోసం పూర్తిగా నలిగిపోయాడు.
ఇందులో ఒక వేరియేషన్ అయితే క్రికెట్ లో ఆట కూలి గాడిగా ఒక యాటిట్యూడ్ తో మైంటైన్ చేస్తూ ఆ వేరియేషన్ ని కూడా చరణ్ అద్భుతంగా పండించాడు. ఇక దీనితో పాటుగా రన్నర్ గా కనిపించిన ఎపిసోడ్ ఒక ఎమోషనల్ ట్విస్ట్ తో ఎంతో బరువును మోసే పాత్రలో అందులో కూడా తాను ఎమోషనల్ గా కదిలిస్తాడు. అలానే ఇలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ ని చరణ్ అంగీకరించి చేయడం అనేది తన గట్స్ కి నిదర్శనం.
ఇక తనతో పాటుగా సినిమాలో అంతకు మించి గుర్తుండి పోయే పాత్ర మాత్రం వెర్సటైల్ నటుడు జగపతిబాబుదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పలసూరిగా తన నటన ఈ సినిమాలో అమోఘం. అందులో తను ఇమిడిపోయి నటించిన తీరు జగపతిబాబు కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. నిడివి ప్రకారం తను కనిపించేది తక్కువ సేపే అయినప్పటికీ అప్పలసూరి మిగిల్చిన ప్రభావం మాత్రం సినిమా పూర్తయ్యేవరకు నిలుస్తుంది. ఆ రేంజ్ లో జగ్గూ భాయ్ పెర్ఫామ్ చేసారు.
ఇక వీరితో పాటుగా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా డీసెంట్ రోల్ సొంతం చేసుకొని కేవలం గ్లామర్ వరకు పరిమితం కాకుండా మంచి నటన కూడా కనబరిచింది. ఇక వీరితో పాటుగా నటుడు శివ రాజ్ కుమార్ కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించారు. మిర్జాపూర్ నటుడు దివ్యెందు శర్మకు టాలీవుడ్ లో ఇది మంచి డెబ్యూ అని చెప్పొచ్చు. వీరితో పాటుగా ఇతర నటీనటులు అంతా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
మొదటిగా ఈ సినిమా విషయంలో భారీ హైప్ ని, మరీ ముఖ్యంగా చిత్ర యూనిట్ లో కొందరు చెప్పిన మాటలు విని ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే మాత్రం ఒకింత నిరాశ తప్పదు. సినిమాలో కంటెంట్ వీరి మాటల రేంజ్ ని మ్యాచ్ చేయలేదు అనిపిస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
అలానే కథనం కొంత మేర ఊహాజనితంగానే సాగుతుంది. ఈ ‘గుర్తింపు’ ఫ్యాక్టర్ ని ఈ మధ్య కాలంలో పలు సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. సో దానికి మరో కోణం అన్నట్టుగా పెద్ది కనిపిస్తుంది. వీటితో పాటుగా సినిమాలో లిప్ సింక్ చాలా సన్నివేశాలకు లేదు. వీటి మూలాన తెలుగు సినిమానే చూస్తున్నప్పటికీ ఆ సహజత్వం కనిపించలేదు. అలానే విజువల్స్ కూడా చాలా చోట్ల గ్రాఫిక్స్ గా తెలిసిపోతున్నాయి. వీటిని ఇంకా కేర్ తీసుకొని డిజైన్ చేయాల్సింది.
సాంకేతిక వర్గం:
సినిమాలో నిర్మాణ విలువలు డీసెంట్ అని చెప్పొచ్చు. కొన్ని మూడు స్పోర్ట్స్ కి తగ్గట్టుగా సెటప్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ అంతా బాగుంది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇంకా కేర్ తీసుకోవాల్సింది. రెహమాన్ మాత్రం ఈ సినిమాకి మాస్ డ్యూటీ చేసారు. ఎక్కడికక్కడ సినిమాని తన ఆర్ ఆర్ తో మంచి హైప్ ఇస్తూ తీసుకెళ్లారు. తన మార్క్ బిట్ సాంగ్స్ కూడా ఇందులో బాగున్నాయి. రత్నవేలు కెమెరా వర్క్ చాలా బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. అంత పెద్ద నిడివి అయినప్పటికీ ఎక్కడా బోర్ అనిపించకుండా కొన్ని కొన్ని ఆశ్చర్య పరిచే ట్రాన్సిక్షన్స్ తో కట్ చేయడం బాగుంది.
ఇక దర్శకుడు బుచ్చిబాబు సానా విషయానికి వస్తే.. తను ఎంచుకున్న పాయింట్ కొత్తదా పాతదా అనేది పక్కన పెడితే తన బ్యాలెన్సుడ్ ప్రెజెంటేషన్ పెద్ది సినిమాకి హైలైట్ గా నిలిచింది. మూడు స్పోర్ట్స్, వాటితోనే అంతర్లీనంగా చెప్పాలనుకున్న ఎమోషన్ ని కదిలించే విధంగా ప్రెజెంట్ చేసారు. కాకపోతే దీన్ని ఇంకా బలంగా చెప్పి ఉంటే మరింత బాగుండేది. అయినప్పటికీ తన వర్క్ ఇంప్రెస్ చేస్తుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసికున్నట్టైతే ఈ ‘పెద్ది’ ఒక కదిలించే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. రామ్ చరణ్ పెర్ఫామెన్స్, మూడు వేరియేషన్స్ లో తను పడ్డ కష్టం వర్ణనాతీతం. జగపతి బాబు మరో హైలైట్ గా నిలిచారు. రెహమాన్ సంగీతం కూడా సినిమాలో బాగా ప్రభావం చూపిస్తుంది. దాదాపు అన్ని ఎమోషనల్ బ్లాక్ లు, సాలిడ్ స్పోర్ట్స్ ఎపిసోడ్స్ థియేటర్ లో ట్రీట్ ఇస్తాయి. సో ఈ సినిమా మెప్పిస్తుంది.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team


