చిరు 150వ సినిమాకు రామ్ చరణ్ భారీ ప్లాన్స్!

chiru-ram-charan
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? చిరును స్క్రీన్‌పై చూసి ఆనందించేదెప్పుడు? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇంకొన్నాళ్ళు ఈ ఎదురుచూపులు ఎలానూ తప్పేలా లేవు. అయితే చిరు తనయుడు రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ సినిమాలో ఓ ఐదు నిమిషాల గెస్ట్ రోల్‌ ద్వారా అభిమానులకు చిరంజీవి చిన్న కానుక ఇవ్వనున్నారు. ఇది చిరంజీవి 150వ సినిమాకు కేవలం టీజర్ లాంటిదని చెప్పుకొస్తున్న రామ్ చరణ్, 150వ సినిమాకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి కొద్దిసేపు తన నిజ జీవిత పాత్రనే పోషించనున్నారు. మొదట్లో చిరంజీవిని బ్రూస్ లీలోని గెస్ట్ రోల్‌కు ఎంపిక చేయాలనే ఆలోచన అస్సలు చేయలేదని, చిరుయే స్వయంగా ఈ రోల్ చేస్తానని తనని ఒప్పించారని రామ్ చరణ్ తెలిపారు. అయితే బ్రూస్ లీలో చిరు రోల్‌ను 150వ సినిమాకు టీజర్‌లా మాత్రమే చూడాలని, ఆ రోల్‌లో ఆయన అబ్బురపరుస్తారని తెలిపారు. చిరు 150వ సినిమా కోసం ఇప్పటికే అన్నీ సిద్ధం చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

చిరంజీవి సినిమా అంటే అన్ని కమర్షియల్ హంగులతో పాటు మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. ఇక 150వ సినిమాలో కూడా అంతర్లీనంగా మెసేజ్ ఉండేలా చూసుకుంటున్నట్లు రామ్ చరణ్ స్పష్టం చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీపై రామ్ చరణ్ స్వయంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలను బ్రూస్ లీ రిలీజ్ రోజైన అక్టోబర్ 16న వెల్లడించనున్నారు. జనవరి నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని తెలిపారు. ఇక ఈ సినిమాలో ఏదైనా ఒకపాటలో చిరుతో కలిసి తాను డ్యాన్స్ తప్పకుండా చేస్తానని రామ్ చరణ్ తెలపడం విశేషం!

Exit mobile version