మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న ఆదివారం రాత్రి విజయనగరంలోని తగరపువలసలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన యూత్ ఫెస్ట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అక్కడ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన చరణ్ తనకు విద్యార్థులంటే చాలా ఇష్టమంటూ వారిని ఉత్తేజపరిచే ప్రసంగం చేశారు. చరణ్ మాట్లాడుతూ ‘విద్యార్థి జీవితం చాలా గొప్పది. నేను సినిమాల్లోకి రావడం వలన బి. కామ్ మధ్యలోనే ఆపేశాను. అది నన్ను ఎప్పుడూ భాదిస్తుంటుంది.
అవకాశముంటే ఒక సంవత్సరం పాటు సినిమాలు వదిలేసి కాలేజ్ లో చేరి చదువుకోవాలనుంది. అవంతి కాలేజ్ అంటే ఒక మంచి పేరుంది. చిన్నా, పెద్ద అందరూ విద్యార్థుల నుండి ప్రేమ పంచడం నేర్చుకోవాలి. అన్యాయం చేస్తే ఎవరినైనా శిక్షించేది విద్యార్థులే. స్టూడెంట్స్ తలుచుకుంటే ఎవరినైనా సూపర్ స్టార్, మెగా స్టార్ ని చెయ్యగలరు. ఏ పార్టీనైనా అధికారంలోకి తీసుకురాగలరు. మీరు ఇలాగే మీ ఎనర్జీని మంచి పనులు చెయ్యడానికి ఉపయోగించండి’ అన్నారు.