
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఈసారి ఏకంగా హైద్రాబాద్ పోలీసులకే తలనొప్పిగా మారాడు. ‘నేను అరెస్టయ్యా..’ అంటూ పోస్ట్ చేసిన ఒక ట్వీట్ అతన్ని వివాదాల్లోకి నెట్టేసింది.
వివరాల్లోకి వెళితే.. రామ్ గోపాల్ వర్మ రీసెంట్‌గా పోలీస్ వాహనంలో కూర్చొని ఓ ఫోటో తీయుంచుకున్నాడు. ఆ ఫోటోతో పాటు ‘నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు..’ అంటూ ట్వీట్ చేశాడు. నిజానికి ఆయన సరదాగా తీయుంచుకున్న ఫోటో అది. ఇప్పుడా సరదా ఫోటోనే ఆయన్ని ఇరకాటంలో పెట్టింది. ట్విట్టర్లో పోస్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. చివరకది పోలీసు వారి కంట్లో పడింది. ఈ విషయం పట్ల పోలీసులు సీరియస్ అయినట్టు సమాచారం. ఆర్జీవీకి ఈ అవకాశం ఇచ్చిన డ్రైవర్‌పైనా పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇదిలా ఉంటే.. కేవలం ఈ ఫోటో మాత్రమే కాక.. ‘నేను పోలీసును..’ అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చొని దిగిన ఫోటో కూడా వివాదం రేపింది. మంచు మనోజ్‌తో రామ్ గోపాల్ వర్మ తీస్తున్న అటాక్ షూటింగ్ జరిగిన ప్రాంతంలో ఈ ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది.