చివరిదశలో రామ్ కొత్త సినిమా!

Ram
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘హరికథ’ అన్న వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ‘శివమ్’ సినిమాతో మంచి హిట్ వస్తుందని ఆశించిన రామ్‌కు ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో ప్రస్తుతం రామ్ తన పూర్తి శ్రద్ధను హరికథపై ఉంచారు. స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో రానున్న ఈ సినిమాలో రామ్ ఎనర్జీకి సరిపడే యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు లవ్, కామెడీ అంశాలకు పెద్ద పీట వేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్‌తో పాటు ఒక్కపాట మినగా షూటింగ్ మొత్తం పూర్తయింది.

ఇక మిగిలి ఉన్న ఆ ఒక్క పాటను నిన్నట్నుంచి గోవాలో మొదలుపెటనున్నారు. ఈ నెల 26వ తేదీతో రామ్ కొత్త సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక ఈ సినిమాకు మొదట్నుంచే హరికథ అన్న పేరునే ప్రచారంలోకి తెచ్చినా, తాజాగా సినిమా యూనిట్ ‘నేను-శైలజ’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయమై ఈ వారమే ఒక కచ్చితమైన టైటిల్‌ను విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను డిసెంబర్ నెలలో, సినిమాను కొత్త సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.

Exit mobile version