
సూపర్ స్టార్ మహేష్‌తో పాటు ఆయన అభిమానులు కూడా ‘శ్రీమంతుడు’ సక్సెస్‌తో సంబరాల్లో మునిగిపోయారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. ఊరిని దత్తత తీసుకొని బాగుపరచడమనే సందేశాత్మక కథకు కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయి విజయం సాధించడానికి సినిమాలోని ప్లస్‌పాయింట్స్‌తో పాటు శ్రీమంతుడు టీమ్ చేపట్టిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా బాగా హెల్ప్ అయ్యాయనే చెప్పాలి.
కాగా విడుదల తర్వాత కూడా అదే స్థాయి ప్రమోషన్స్ చేస్తూ మహేష్ ఈ సినిమాను మరింత ముందుకు తీసుకెళుతున్నారు. సోషల్ సైట్స్‌లో ఎప్పుడో గానీ ప్రత్యక్షమవ్వని మహేష్, ఇప్పుడు ఏకంగా అభిమానులతో చాట్ సెషన్ కూడా ఏర్పాటు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరచాడు. ఈ క్రమంలోనే మహేష్ ఈ సాయంత్రం ఫేస్‌బుక్‌లో చేపట్టిన ఓ చాట్ సెషన్‌లో అభిమానులు మహేష్‌ను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఇక ఆ ప్రశ్నలకు మహేష్ తన స్టైల్లోనే సమాధానాలిస్తూ వచ్చారు. ముఖ్యంగా మహేష్ కూతురు సితార గురించి అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు మహేష్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
సితార, ‘శ్రీమంతుడు’ సినిమాను రెండు సార్లు చూసిందని చెబుతూ.. రామ రామ అనే పాట రాగానే సితార డ్యాన్స్ చేసేస్తుందని మహేష్ తెలిపారు. ఇక శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్‌కు హాజరు కాలేకపోయిన సితార, ఇంట్లో నుంచి ఆ ప్రోగ్రామ్ చూస్తూ డ్యాన్స్ చేయడం తామందరినీ నవ్వించిందని మహేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక శ్రీమంతుడు విషయానికి వస్తే మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.