దగ్గుబాటి వారసుడు రానా కెరీర్ ప్రస్తుతం మంచి జోరు మీద ఉంది. ‘దం మరో దం’తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన రానా విజయం అందుకోకపోయినా అక్కడి ప్రేక్షకుల, పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించాడు. ఇటివల అక్షయ్ కుమార్ ‘బేబీ’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన రానా, ఆ సినిమా విడుదలకు ముందే మరో అవకాశం సొంతం చేసుకున్నాడు. ఈ రోజు కొత్త సినిమాకు సంతకం చేశాడు. ఈ సినిమా వివరాలు నేడు విడుదల కానున్నాయి.
ప్రస్తుతం రానా తెలుగులో ప్రతిష్టాత్మక చారిత్రాత్మక సినిమాలలో నటిస్తున్నాడు. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ రెండు సినిమాలలో కీలక పాత్రలు పోషించాడు. ఆయా పాత్రల కోసం తన శరీరాకృతిని మార్చుకున్నాడు. హిందీలో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలన్ని 2015లో విడుదలవుతాయి. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ తెలుగు, హిందీ భాషల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.


