
ఇప్పుడు ఏ సినీ అభిమానిని పట్టుకొని అడిగినా అంతటా బాహుబలి విశేషాలే! దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోన్న ఈ సినిమాలో విలన్‌గా నటించిన రానా దగ్గుభాటి ప్రస్తుతం ‘బాహుబలి’ తెచ్చిపెట్టిన సంతోషంలో మునిగిపోయారు. టాలీవుడ్‌లో ఆరడుగులకు పైనే పొడవు, అందుకు తగ్గట్టుగానే కండపుష్టి కలిగిన హీరోల్లో రానా మొదటి స్థానంలో ఉంటారు. తన ఫిజిక్, యాక్టింగ్‌తో ఇటు టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ దేశమంతటికీ పరిచయస్థుడైపోయారు రానా. ఇక ‘బాహుబలి’ తర్వాత అతడి రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది.
ఇదిలా ఉంటే.. ఓ ప్రముఖ వాచీ స్టోర్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన రానా, బాహుబలి విజయం సాధించడం పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు. బాహుబలి సినిమా తాము అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ తెచ్చుకొని మంచి సంతృప్తినిచ్చిందని తెలుపుతూ.. ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న సినిమాలో విలన్‌గా నటించడం తన అదృష్టమని రానా తెలిపారు.
ఇక ఇదే సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ కలల ప్రాజెక్టైన ‘రుద్రమదేవి’లో తన పాత్ర గురించి కూడా ప్రస్తావించారు. రుద్రమదేవిలో తనది చిన్న పాత్రేనని, అయితే చిన్న పాత్రైనా అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దబడినది కావడంతో ఆ పాత్ర తనకు మంచి గుర్తింపు తెస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అనుష్క టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ బయోపిక్ కావడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

