
‘బాహుబలి’లో భల్లాల దేవగా కనిపించి దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయిన హీరో రానా.. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ సరికొత్త స్టార్‌గా అవతరించారు. ఇక ఇంతకుముందే తమిళ, హిందీల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన రానాకు, బాహుబలి తర్వాత ఆయా ఇండస్ట్రీల నుంచి క్రేజీ ఆఫర్స్ చుట్టుముడుతున్నాయి. తాజాగా అదే కోవలో జాతీయ అవార్డు గ్రహీత అయిన దర్శకుడు బాలా తెరకెక్కించే ఓ సినిమాలో రానా ఓ ప్రధాన పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.
రియలిస్టిక్ సినిమాలకు పెట్టింది పేరైన బాలా, తమిళంలో వివాదాస్పద రచనగా పేరొందిన ‘కుట్ర పరంబరై’ కథతో ఓ సినిమాను తెరకెక్కించనున్నారట. రానా, ఆర్య, విశాల్, అరవింద్ స్వామి, అదర్వ ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో ప్రస్తుతం బాలా నిమగ్నమై ఉన్నారని సమాచారం. ఇక భారత దేశం స్వాతంత్ర్యం పొందడానికి పూర్వం కథతో తెరకెక్కే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

